పరీక్షల రద్దుపై ఆంధ్రప్రదేశ్‌కు సుప్రీంకోర్టు నోటీసు...

శుక్రవారం, 18 జూన్ 2021 (08:26 IST)
దేశంలో కరోనా వైరస్ దాటికి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను రద్దు చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో 12వ తరగతి పరీక్షలు రద్దు చేయని ఆంధ్రప్రదేశ్, త్రిపుర, పంజాబ్, అస్సాం రాష్ట్రాలకు సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. 
 
కరోనా మహమ్మారి దృష్ట్యా దేశంలో 28 రాష్ట్రాలకు గాను 18 రాష్ట్రాల బోర్డులు ఇప్పటికే 12వ తరగతి పరీక్షలను రద్దు చేశాయి. ఆరు రాష్ట్రాల బోర్డులు కరోనా ఉద్ధృతి రాకముందే పరీక్షలు నిర్వహించాయి. మిగిలిన నాలుగు రాష్ట్రాలైన ఏపీ, త్రిపుర, పంజాబ్, అస్సాం పరీక్షలను రద్దు చేయలేదు. 
 
రద్దు చేసిన సీబీఎస్‌ఈ పరీక్షలకు సంబంధించిన మార్కుల విధానానికి ఆమోదం తెలిపే సందర్భంలో ఈ నాలుగు రాష్ట్రాల గురించి చర్చకు రావడంతో ధర్మాసనం వీటికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదావేసింది. 
 
అయితే, సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన విషయం తమకు తెలియదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. నోటీసులు అందిన తర్వాత ఈ విషయమై పరిశీలించి చర్చిస్తామన్నారు. పరీక్షల విషయంలో తాము మొదటి నుంచి ఒకే వైఖరితో ఉన్నామని, ఇందులో మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని మంత్రి వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు