‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అంటూ పుస్తకం రాసిన కంచ ఐలయ్యపై శ్రీపీఠం అధినేత పరిపూర్ణానంద స్వామి మండిపడ్డారు. ఇదే అంశంపై ఆయన శనివారం మాట్లాడుతూ, రెండు కళ్లు లేని తన తల్లిని కూడా కంచ ఐలయ్య అవమానించారన్నారు.
రూ.లక్ష కోట్లు ఇస్తే బైబిల్‌కు ప్రచారం చేస్తానంటూ ఐలయ్య చెప్పారని మండిపడ్డారు. కోట్ల రూపాయల కోసం దేశ రహస్యాన్ని, ధర్మాన్ని ఐలయ్య తాకట్టు పెట్టారన్నారు. జకీర్ నాయక్ కంటే ఐలయ్యే ప్రమాదకరమైన వ్యక్తి అని ఆయన గుర్తుచేశారు. ఒక కులాన్ని కించపరుస్తూ పుస్తకం రాసే అధికారాన్ని ఐలయ్యకు ఎవరిచ్చారని మండిపడ్డారు.
కోమట్లు లేకపోతే నీకు నిత్యావసర సరుకులు ఎక్కడ దొరుకుతాయని ప్రశ్నించారు. నువ్వు వేసుకునే సూటు, బూటుకు సమాజం విలువ ఇవ్వదని... నీతిగా ఉన్నప్పుడే సమాజం విలువనిస్తుందని ఐలయ్యను ఉద్దేశించి అన్నారు. కంచ ఐలయ్యలాంటి కలుపు మొక్కలను ప్రోత్సహించవద్దని ఆయన కోరారు.
అదేసమయంలో తెరాస మంత్రి హరీష్ రావు కూడా ఇదే అంశంపై స్పందించారు. ప్రొ.కంచ ఐలయ్య తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే ఆయనకే మంచిదని, ఒక కులాన్ని దూషించడం అనేది ఏ ఒక్కరికీ తగదన్నారు. ఐలయ్య రాసిన పుస్తకంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని వైశ్యులు తమకు వినతిపత్రం ఇచ్చారని చెప్పారు.