వైసీపీ ప్రభుత్వ నిర్ణయం పీజీ విద్యార్థుల పాలిట యమపాశం: సయ్యద్ రఫీ
ఆదివారం, 27 డిశెంబరు 2020 (06:28 IST)
ఇళ్లపట్టాల పంపిణీపై గొప్పలుచెప్పుకుంటున్న ముఖ్యమంత్రి పీజీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేలా నిన్నటికి నిన్న పిడుగులాంటి జీవో ఇచ్చాడని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు. ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రే, నేడు ఆరెండుపథకాలను రద్దుచేసేందుకు సిద్ధమయ్యాడన్నారు. గతంలో తనతండ్రి ప్రారంభించిన ఫీజురీయింబర్స్ మెంట్ పథకానికి మెరుగులుదిద్ది రూ.లక్షా50వేలవరకు చెల్లిస్తానని ఎన్నికలముందు జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగిందన్నారు.
ఆనాడు అలాచెప్పిన జగన్, నేడు పీజీకోర్సులు చదువుతున్న సుమారు 70వేలమంది విద్యార్థులపాలిట యముడిలా తయార య్యాడని రఫీ మండిపడ్డారు. నిన్నటికి నిన్న జగన్ ప్రభుత్వం విడుదలచేసిన జీవోనెం-77, పీజీవిద్యార్థుల పాలిట నిజంగా మరణశాసనమే అవుతుందన్నారు. జగన్ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 637 కాలేజీల్లో చదువుతున్న 70వేల మంది విద్యార్థుల జీవితాలు చీకట్ల పాలయ్యాయన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ప్రతిఒక్క పీజీ విద్యార్థి ప్రభుత్వ కళాశాలల్లోనే చదవాలనే నిబంధన విధించారని, అదెంతవరకు సాధ్యమో పాలకులే సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉండే పీజీ సీట్లు ఎన్నిఉంటాయో, ఎందరు విద్యార్థులకు మెరుగైన విద్య లభిస్తుందో, ఆ తర్వాత ఉత్తమఉపాధి అవకాశాలు లభిస్తాయో జీవో ఇచ్చిన ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని రఫీ డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఏదైనాపథకాన్ని ప్రారంభించేముందు, దాని విధివిధానాలు, అదెంతవరకు ప్రజలకు మేలుచేస్తుందనే ఆలోచన కూడా చేయకుండా రెండేళ్లు గడవకముందే రెండుపథకాలను వైసీపీప్రభుత్వం రద్దుచేసిందన్నారు. తాను అమల్లోకి తీసుకొచ్చిన రెండుపథకాలను రద్దుచేయడంద్వారా జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల జీవితాలను సర్వనాశనం చేశాడని రఫీ మండిపడ్డారు.
కేంద్రంనుంచి నిధులొచ్చేపథకాలను మాత్రమే తనపేరుతో జగన్మోహన్ రెడ్డి అమలుచేస్తున్నాడని, అలా నిధులు రావడం లేదనే జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు మంగళం పాడేశాడన్నారు. జగన్ ప్రభుత్వం పీజీ విద్యార్థులకు అన్యాయం చేసేలా ఇచ్చిన జీవోనుతక్షణమే వెనక్కు తీసుకోవాలని రఫీ డిమాండ్ చేశారు.
టీడీపీ ప్రభుత్వంలో విదేశాల్లోచదువుకునే విద్యార్థులకుకూడా ఏటా నిధులు అందించడం జరిగిందని, జగన్ అధికారంలోకి రాగానే విదేశాల్లో విద్యనభ్యసించే దాదాపు 4వేలమంది విద్యార్థులకు తీరని అన్యాయం చేశాడన్నారు.
అమ్మఒడి పథకాన్ని ప్రతివిద్యార్థికి అందిస్తానన్న జగన్, నేడు విద్యార్థులసంఖ్యను కాదని తల్లుల సంఖ్యతో పథకాన్ని ముడిపెట్టి, సగానికిపైగా విద్యార్థులకు పథకాన్ని దూరంచేశాడన్నారు. ఒకచేత్తోఇస్తూ, మరోచేత్తో లాగేసుకోవడం జగన్మోహన్ రెడ్డికి అలవాగుగా మారిందని, ఆయనఅమలుచేస్తున్న పథకాలు ప్రకటనల్లో తప్ప వాస్తవంలోఅమలు కావడం లేదన్నారు.
మాటతప్పను, మడమతిప్పను అనిచెప్పుకునే ముఖ్యమంత్రి, తాను తీసుకొచ్చిన పథకాలను తానే రద్దు చేయడమేంటన్నారు. పీజీ విద్యార్థుల భవిష్యత్ కు గొడ్డలిపెట్టులాంటి జీవో నెం-77ను జగన్ ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని రఫీ డిమాండ్ చేశారు.
పేదవిద్యార్థులకు ఉచితంగా విద్యను, వసతిని కల్పిస్తానని చెప్పిన, ఇప్పుడు ప్రభుత్వకాలేజీల్లో చదివేవారికి మాత్రమే అనే నిబంధనతో వారి భవిష్యత్ ను నాశనంచేయడమేంటన్నారు. నిరుద్యోగులకు నిరుధ్యోగభృతిని, విదేశాల్లోని విద్యార్థులకు నిధులను, ఉద్యోగార్థులకు జాబ్ క్యాలెండర్ ను ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి తాజాగా పీజీ విద్యార్థులమెడపై కత్తిపెట్టడం భావ్యం కాదని రఫీ తేల్చిచెప్పారు.