60 రోజుల తర్వాత ఉండవల్లికి చేరుకున్న చంద్రబాబు

సోమవారం, 25 మే 2020 (15:39 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు నెలల తర్వాత విజయవాడ, ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. కరోనా లాక్డౌన్‌కు ముందు హైదరాబాద్ వెళ్లారు. తిరిగి వచ్చే సమయానికి కేంద్రం లాక్డౌన్ అమల్లోకి తెచ్చింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇపుడు లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో చంద్రబాబు రెండు నెలల తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టారు. మార్చి 22 నుంచి హైదరాబాదులోనే ఉన్న ఆయన లాక్డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో ఉండవల్లి వచ్చారు.
 
నిజానికి ఆయన సోమవారం విశాఖపట్టణం వెళ్లి, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితులను పరామర్శించాల్సివుంది. కానీ, ఆయన ప్రయాణించే విమానం రద్దు కావడంతో ఆయన వైజాగ్ పర్యటన రద్దు అయింది. దీంతో రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి అమరావతికి పయనమయ్యారు. ఆయనకు ఏపీలోని పలు ప్రాంతాల్లో అభిమానులు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు వెంట ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా ఉన్నారు. 
 
కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు, లోకేశ్ ఉండవల్లిలోని తమ నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబుకు పార్టీ కార్యకర్తలు, అమరావతి రైతులు ఘనస్వాగతం పలికారు. కరకట్టపై నిలబడిన పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు అభివాదం చేశారు.
 
కాగా, ఈ నెల 27, 28వ తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమాల్లో ఆయన మంగళగిరి సమీపంలోని ఎన్టీఆర్‌ భవన్‌ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు