ఏపీలోని ప్రకాశం జిల్లాలో తెదేపా నేత భార్య, హనుమాయమ్మ మృతిపై డీజీపీ సహా పలువురు అధికారులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు లేఖలు రాశారు. ఎస్సీ మహిళ మృతిపై జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా లేఖలు రాశారు.
అంగన్‌వాడీ టీచరుగా పని చేసే హనుమాయమ్మ మృతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని కోరారు. ఈ ఘటనలో వైకాపా నేతలకు పోలీసుల సహకారంపైనా విచారించాలన్నారు. మృతురాలి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని, ఆమె కుమార్తెకు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సుధాకర్ భార్య హనుమాయమ్మ అదే గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తుంది. స్థానిక వైకాపా నాయకుడు సవలం కొండలరావు, సుధాకర్ కుటుంబాల మధ్య పొలం తగాదాలున్నాయి. సోమవారం వైకాపా నియోజకవర్గ బాధ్యుడు వరికూటి అశోక్‌బాబు తూర్పునాయుడుపాలెంలోని ఎమ్మెల్యే స్వామి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టారు.
దీన్నిఅడ్డుకునేందుకు తెదేపా శ్రేణులతోపాటు సుధాకర్ ఉదయాన్నే తూర్పునాయుడుపాలెం వెళ్లారు. ఇదే సమయంలో ఉదయం అంగన్‌వాడీ పాఠశాలకు వెళ్లిన హనుమాయమ్మ.. మధ్యాహ్న సమయంలో ఇంటికి వచ్చారు. ఇంటి ఎదుట రహదారి పక్కన నిల్చుని కుమార్తె మాధురిని మంచినీళ్లు తేవాలని పిలిచారు. ఆమె నీళ్లు తెచ్చి తల్లికిచ్చి తిరిగి లోపలికి వెళ్లారు.