వైకాపా మూకలు అహంకారంతో రెచ్చిపోతున్నాయ్.. రజనీ విమర్శలపై చంద్రబాబు కౌంటర్

సోమవారం, 1 మే 2023 (12:41 IST)
అధికార మదంతో వైకాపా మూకులు అహంకారంతో రెచ్చిపోతున్నాయని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల విజయవడా వేదికగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని రజనీకాంత్ పంచుకున్నారు. 
 
హైదరాబాద్ నగర అభివృద్ధిలో చంద్రబాబు కృషిని కొనియాడారు. నవ్యాంధ్ర అభివృద్ధి కోసం చంద్రబాబు రూపకల్పన చేసిన 2046 అమలు చేస్తే దేశంలోనే అగ్ర రాష్ట్రంగా అవతరిస్తుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలను వైకాపా నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. రజనీకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
రజనీని లక్ష్యంగా చేసుకుని వైకాపా నేతలు చేస్తున్న విమర్శలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. తీవ్ర అహంకారంతో అధికార పార్టీ నేతలు చేస్తున్న అర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలెవరూ సహించరన్నారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్‌ చేశారు.
 
'అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని.. అనుభవాలను పంచుకున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై వైకాపా మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైకాపా నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైకాపా ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ కూడా చేయలేదు.. ఎవరినీ చిన్న మాట అనలేదు.
 
పలు అంశాలపై రజనీ కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న అర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్‌పై వైకాపా నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమే. నోటి దురుసు గల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి. జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి' అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు