వేటకొడవళ్ళతో నరుక్కున్న టీడీపీ - వైకాపా కార్యకర్తలు

గురువారం, 11 ఏప్రియల్ 2019 (14:06 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. అదేసమయంలో అధికార టీడీపీ, విపక్ష వైకాపా శ్రేణులు పరస్పరం దాడులకు దిగారు. 
 
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఒక్కసారిగా పరిస్థితులు అదుపుతప్పాయి. వీరాపురంలో ఏర్పాటుచేసిన ఓ పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం తలెత్తింది. అది కాస్తా ఘర్షణగా మారడంతో ఇరువర్గాలు వేటకొడవళ్లతో పరస్పరం దాడి చేసుకున్నాయి. దీంతో అక్కడి ఓటర్లు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇరువర్గాలు దాడి చేసుకోవడంతో ఈ ప్రాంతం రణరంగంగా మారింది.
 
ఈ దుర్ఘటనలో టీడీపీ కార్యకర్త భాస్కర రెడ్డి మృత్యువాతపడగా, వైసీపీ కార్యకర్త పుల్లారెడ్డి తీవ్రంగా గాయపడి తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో గాయపడ్డ మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు పోలింగ్ కేంద్రం వద్ద అధికారులు అదనపు బలగాలను మోహరించారు. జిల్లా ఎస్పీ ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు