బాబు మాట్లాడారు... కార్యకర్తలు ఉండమన్నారు.. ఊపిరున్నంత వరకూ : బొజ్జల గోపాలకృష్ణారెడ్డి

ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (09:30 IST)
మంత్రి పదవి నుంచి తొలగించినందుకు కొద్దిరోజుల పాటు అలకపాన్పునెక్కిన మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కూల్ అయ్యారు. తన పుట్టిరోజునాడు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీనికితోడు శ్రీకాళహస్తి కార్యకర్తలంతా పార్టీలోనే కొనసాగలని బొజ్జలకు సూచించారు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. 
 
బొజ్జల 69వ జన్మదిన వేడుకలు శనివారం ఆయన స్వగ్రామమైన శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫోన చేసి బొజ్జలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాత శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వారంతా తమ అభిప్రాయాలను వెల్లడించాలని గోపాలకృష్ణారెడ్డి కోరారు. టీడీపీలోనే కొనసాగాలని ఈ సందర్భంగా వారందరూ బొజ్జలను కోరారు. 
 
అనంతరం గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల నిర్ణయమే తనకు శిరోధార్యమని చెప్పారు. తుదిశ్వాస ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. 2019వ సంవత్సరంలో జరిగే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తనకు తగిన విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తనను మంత్రివర్గం నుంచి తప్పించారని చెప్పారు. తమది తెలుగుదేశం కుటుంబమని... పార్టీ మారాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శాసనసభ సభ్యత్వానికి తాను చేసిన రాజీనామాను ఉపసంహరించు కుంటానని, శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని టీడీపీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి