ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రచ్చకు కారణం అయిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి బెయిల్ మంజూరయింది. అమరావతిలోని హైకోర్టు పట్టాభికి బెయిల్ ఇచ్చింది. ఈ రోజు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు పట్టాభికి బెయిల్ ఇచ్చింది. సెక్షన్ 41 ఏ నోటీసులపై పోలీసులు కింది కోర్టు సూచనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.
సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం జగన్‌పై పరుష పదజాలం ఉపయోగించినందుకు పట్టాభిపై క్రైం నం.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్‌విత్ 120(బి) సెక్షన్ల కింద గవర్నరుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం పట్టాభి రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు బెయిల్ మంజూరు చేయడం వల్ల ఎటువంటి సాక్ష్యం, ఆధారాలను ప్రభావితం చేసే, రూపు మాపే అవకాశాలు లేకపోవడంతో, ఈ బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది.
పట్టాభి వ్యాఖ్యల వల్ల రేగిన దుమారం అంతా ఇంతా కాదు. ఏపీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. పట్టాభి ఇంటిపై కూడా దాడి జరిగింది. దీనితో కోపోద్రిక్తుడు అయిన నారా చంద్రబాబు 36 గంటల దీక్ష కూడా చేశారు. ఇది ముగిసే సమయానికి పట్టాభికి బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంటోంది.