టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర అరెస్టు

సోమవారం, 20 జూన్ 2022 (11:56 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్రను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో మట్టిమాఫియాకు వ్యతిరేకంగా తెదేపా నేతలు తలపెట్టిన 'ఛలో అనుమర్లపూడి' కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు విధించిన ఆంక్షలను ఉల్లంఘించి అనుమర్లపూడి చెరువు వద్దకు చేరుకున్న తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్‌ చేశారు. 
 
ఈ సందర్భంగా పోలీసుల వైఖరిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ సహా ఎవరి అనుమతులతో చెరువును తవ్వుతున్నారని వైకాపా అరాచకాలకు అంతులేకుండా పోతోందని మండిపడ్డారు. ఈ క్రమంలో తెదేపా కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటుచేసుకుంది. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి తెదేపా నేతలు అనుమర్లపూడి వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. దీంతో పొన్నురుతో పాటు గుంటూరు వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొనివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు