నవ్యాంధ్రలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయి. ఈ నెల 23వ తేదీన వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో నవ్యాంధ్రలో అధికార తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోగా, వైకాపా అధికారంలోకి వచ్చింది. ఆ మరుసటిరోజు నుంచే టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. టీడీపీ నేతల ఇళ్ళను, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. గత వారం రోజుల్లోనే నలుగురైదుగురు టీడీపీ కార్యకర్తలు హత్యలకు గురికాగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మడమలూరులో మంగళవారం రాత్రి టీడీపీ కార్యకర్త శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు ఆయన్ను పరుగెత్తించి, పరుగెత్తించి కత్తులతో నరికి చంపారు. ఆయన తన ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా ఈ హత్య జరిగింది. ఆ తర్వాత దుండగులు అక్కడ నుంచి పారిపోయారు.
బుధవారం ఉదయం రోడ్డుపక్కన పడివున్న శ్రీనివాసులు మృతదేహాన్ని గుర్తించిన పోలీసులకు సమాచారం చేరవేశారు. ఆ వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. టీడీపీ కార్యకర్త హత్యతో మడమలూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు గట్టిపోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.