అబ్బాయితో సన్నిహితంగా ఉందనీ కుమార్తెను గొడ్డలితో నరికి చంపిన తండ్రి.. ఎక్కడ?

బుధవారం, 26 అక్టోబరు 2022 (08:21 IST)
తన మాట వినకుండా ఓ అబ్బాయితో సన్నిహితంగా ఉన్నందుకు కన్నబిడ్డ అని కూడా చూడకుండా ఓ తండ్రి అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. కుమార్తెను గొడ్డలిపై నరికిపారేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది సార్లు గొడ్డలితో నరికేశాడు. దీంతో ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం, పాతపల్లి గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...  
 
ఈ గ్రామానికి చెందిన రాజశేఖర్-సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. చిన్నకుమార్తె గీత (15) పెబ్బేరు పట్టణంలోని ప్రభుత్వ బాలిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఓ బాలుడుతో తన కుమార్తె సన్నిహితంగా మెలగడాన్ని రాజశేఖర్ చూశాడు. దీంతో కుమార్తెను పలుమార్లు మందలించాడు. కుటుంబ పరువు తీయొద్దని, బుద్ధిగా చదువుకోవాలని హితవు పలికాడు. 
 
ఈ క్రమంలో మంగళవారం సునీత పొలం పనులకు వెళ్లగా, మరో కుమార్తె, కుమారుడు ఇంట్లో లేరు. ఆ సమయంలో కుమార్తె గీతకు మరోమారు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాజశేఖర్.. ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకని కుమార్తె మెడపై దాడి చేశాడు. 
 
అలా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఎనిమిదిసార్లు వేటు వేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన గీత రక్తపుమడుగులో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత రాజశేఖర్ నేరుగా పోలీస్ స్టేషన్‍కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోద చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు