మీ నిజాయితీని మడిచీ... చంద్రబాబును ఓ రేంజిలో ఆడుకున్న తెలంగాణ మంత్రి

మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (03:25 IST)
రెండున్నరేళ్ల క్రింత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరినప్పటికీ నేటికీ టీడీపీ సభ్యుడిగానే ఉన్న తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌కు ఇప్పుడు ఒక అద్బుతమైన అవకాశం వచ్చింది. డబుల్ ప్రమోషన్ కాదు. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై కసి తీర్చుకునే అవకాశం మరి. దొరగ్గానే డైలాగేశారు. నీతి, నిజాయితీ, సమగ్రత అంటూ నీతులు చెప్పడం ఇకనైనా ఆపేయాలని తలసాని ఏకిపడేశారు.
 
తెలంగాణలో ఫిరాయించిన ఎమ్మల్యేలను మంత్రులుగా తీసుకోవద్దని, ఇదేం రాజకీయ నీతి అని మహా నీతి మాటలు చెప్పి తనను మనిషే కాదన్న స్థాయిలో ప్రచారం చేసిన చంద్రబాబును  తలసాని తీవ్రంగా విమర్శించారు. సోమవారం ఆంద్రప్రదేశ్‌ మంత్రివర్గంలోకి నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలను తీసుకున్న చంద్రబాబును ఇకనుంచి నీతులు చెప్పడం ఆపివేయాలని బోధ చేశారు. రాజకీయాల్లో సమగ్రత, నిజాయితీ గురించి మాట్లాడే నైతిక హక్కు తమరికి లేదంటూ ఎద్దేవా చేశారు.
 
2014 డిసెంబర్‌లో తాను తెలంగాణ మంత్రివర్గంలో చేరినప్పుడు భూమండలమే ఒకవైపు ఒరిగిపోయినట్లుగా ప్రచారం చేసి తనను అనరాని మాటలతో దుష్టుడిగా ప్రచారం చేసిన చంద్రబాబును ఇప్పుడు తమరు చేసింది ఏమిటి మహాశయా అంటూ తలసాని పరిహసించారు. నీతిమాటల, హితబోధల బాబు ఇప్పుడు ఈ స్టెప్ వేయడం ఏమిటి అని గేలి చేశారు.
 
తెరాస మంత్రివర్గంలో నేను చేరినప్పుడు మీ తెలంగాణ టీడీపీ నేతలంతా ఢిల్లీకి పరుగెత్తి హత్య జరిగిపోయిన చందాన గావు కేకలు, పెడబొబ్బలు పెట్టారే. ఏపీలో చంద్రబాబు సరిగ్గా ఇదే పని చేసినప్పుడు వీళ్లంతా ఇప్పుడేమంటారు. నోరు పెకలడం లేదా అంటూ తలసాని ప్రశ్నించారు. 
 
నీతి, నిజాయితీ మీద నిజంగా గౌరవం ఉంటే టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెంటనే రాజీనామా చేయాలని ఆదేశించి టీడీపీ టిక్కెట్‌పై గెలవమని చెప్పండి అంటూ తలసాని బాబుకు హితవు చెప్పారు. చంద్రబాబు ఆ పనిచేస్తే నేనూ అలాగే చేస్తా.. ఆయన తన సవాలుకు ప్రతిస్పందిస్తారనే అనుకుంటున్నా అనేశారు తలసాని.
 

వెబ్దునియా పై చదవండి