రాష్ట్ర చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో 5 నెలలకే ప్రభుత్వంపై ప్రజలు యుద్ధాన్ని ప్రకటించే స్థాయికి ప్రజా వ్యతిరేకత పెరిగిపోయిందని, జగన్ తుగ్లక్ పాలనలో ఇసుకను వైకాపా నాయకుల ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ అన్నారు.
ఈ మేరకు గుంటూరు తెదేపా రాష్ట్ర కార్యాలయం నుంచి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయటం ద్వారా 5 ఏళ్లల్లో ఒక్క భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య చేసుకోలేదు. కాని నేడు తుగ్లక్ పాలనలో దాదాపు 10 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, లక్షలాది కూలీలు పస్తులుంటున్నా వైకాపా నాయకులు మాత్రం మానవత్వాన్ని మరిచి తుగ్లక్ అడుగులకు మడుగులొత్తుతున్నారు.
ఇసుక మాఫియాకు పాల్పడి ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించుకుంటూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇసుక కొరతను నివారించి అందరికి అందుబాటులో తీసుకురావడానికి బదులుగా కూలీలను అవమాన పరిచేలా వైకాపా నాయకులు మాట్లాడటం హేయం. కృత్రిమ కొరత సృష్టించిన వైకాపా ప్రభుత్వం తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి వరదలపై నెపం వేసి అమాయక ప్రజలను నమ్మించడానికి ఆపసోపాలు పడుతున్నారు.
2011లో కృష్ణానదికి 25 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఏనాడు ఇసుక కొరత మాటేలేదు. నేడు ఎగువ రాష్ట్రాల్లోను వరదలు వస్తున్నాయి కాని ఏ రాష్ట్రంలోను ఇసుక కొరత లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తే భవన నిర్మాణ కార్మికులను ఆదుకున్నవారవుతారు. లేదంటే భవన నిర్మాణ కార్మికులే మీ ప్రభుత్వానికి చరమ గీతం పాడతారు.