సక్రమంగా ఇంటింటి సర్వే: నీలం సాహ్ని

శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (21:46 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు వైరస్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించేందుకు ఇంటింటా సర్వే ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. కరోనా వైరస్‌పై శుక్రవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆమె వీడియో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ కంటైన్మెంట్ జోన్‌లో ఉన్న వారిలో ఎవరైనా హైరిస్క్‌లో ఉంటే అలాంటి వారిని వెంటనే వైద్య పరీక్షలకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లును ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో సర్వే లెన్స్ వేగవంతంగా నిర్వహించాలని చెప్పారు. మూడు రోజుల్లో సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు.

విలేజ్/వార్డు వాలంటీర్లు రేషన్ సరుకులు, పించన్లు పంపిణీలో నిమగ్నమై ఉన్నందున సబ్ సెంటర్ స్థాయిలోని ఎఎన్ఎంలు సర్వే ప్రక్రియలో చురుకుగా వ్యవహరించాలని ఆదేశించారు. హైరిస్క్ లో ఉన్న వ్యక్తులు లేదా 65ఏళ్ళు పైబడి ఉన్న వారికి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

50ఏళ్ళలోపు గల వారు 14రోజులపాటు  హోం ఐసోలేషన్ లో ఉండేలా చూడాలని చెప్పారు. క్వారెంటైన్ కేంద్రాలలో ఉంచిన వారికి ప్రత్యేక గదులు, బాత్ రూం లు ఏర్పాటు చేయాలని ఇందుకు సంబంధించిన ప్రోటోకాల్ ను సక్రమంగా పాటించాలని సిఎస్ నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు.అంతేగాక ఈ కేంద్రాలలో ఉంచిన వారికి డోస్పోజబుల్ ప్లేట్లో భోజనం అందించాలని స్పష్టం చేశారు.

అదే విధంగా ప్రతి క్వారంటైన్ కేంద్రం వద్ద ఒక వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచాలని అన్నారు.అంతేగాక ఆ వైద్య బృందం అక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కేస్ షీటును నిర్వహించాలని సిఎస్ నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లుకు స్పష్టం చేశారు.

విజయవాడ కంట్రోల్ రూమ్ నుండి వీడియో సమావేశంలో  వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1157 శాంపిల్ పరీక్షలు నిర్వహించగా 108 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు.

క్వారెంటైన్ కేంద్రాలుగా పెద్ద పెద్ద క్యాంపస్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. అక్కడ ప్రతి ఒక్కరికీ తగిన వసతులు కల్పించాలని చెప్పారు. కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కె.భాస్కర్ మాట్లాడుతూ క్వారంటైన్ కేంద్రాలలో వసతులు కల్పనకు జిల్లా మినరల్ నిధులను వినియోగించుకోవాలని చెప్పారు.

ప్రతి కేంద్రంలో 24గంటలూ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని,రోజుకు రెండు సార్లు బాత్ రూం లను శుభ్రం చేయాలని చెప్పారు. ఈకేంద్రాల్లో చేపట్టాల్సిన చర్యలుకు సంబంధించిన స్టాండర్డు ఆపరేటివ్ ప్రోసీజర్ (ఎస్ఓపి)కి సంబంధించిన ఆదేశాలను జారీ చేయనున్నట్లు తెలిపారు.

టిఆర్ఆండ్‌బి ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు మాట్లాడుతూ ఆన్ని రైతు బజారులు, నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాలు వద్ద పెద్దసైజు బోర్డులను ఏర్పాటు చేసి ధరల పట్టికను ప్రదర్శించాలని చెప్పారు.భౌతిక దూరాన్ని పాటించేందుకు వీలుగా అవకాశం ఉన్న అన్ని చోట్ల పెయింటింగ్ వేయించాలని అవకాశం లేనిచోట్ల మట్టితో మార్కు చేయాలని సూచించారు.

వీడియో సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి, పంచాయతీరాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్, మున్సిపల్ శాఖ కమీషనర్ జిఎస్ఆర్కె విజయకుమార్, పరిశ్రమల శాఖ సంచాలకులు సుబ్రహ్మణ్యం, సిఆర్డిఏ అదనపు కమీషనర్ విజయకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు