అందుకే ఉద్యోగానికి వెళ్తున్నావా? లాక్‌డౌన్‌లో భార్యకు నరకం, ఆమె ఆత్మహత్య, అవమానంతో మామ కూడా...

శనివారం, 24 అక్టోబరు 2020 (13:18 IST)
చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం పరిధిలోని బోడిరెడ్డిగారి పల్లెలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త నిత్యం వేధింపులకు పాల్పడటంతో వాటిని తట్టుకోలేని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కోడలు ఆత్మహత్య చేసుకున్నదన్న అవమానంతో ఆమె మామయ్య పొలంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
వివరాలు ఇలా వున్నాయి.. బోడిరెడ్డిగారి పల్లెలో రామిరెడ్డి-పూర్ణమ్మల కుమారుడు ఆనంద్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌. లాక్ డౌన్ కాలంలోనే.. అంటే జూన్ నెలలో అతడికి అదే గ్రామానికి చెందిన హరితతో వివాహం అయ్యింది. ఆమె అపోలో ఆసుపత్రిలో నర్సింగ్ లెక్చరర్ గా పనిచేస్తోంది. లాక్ డౌన్ కారణంగా భర్త ఇంటి వద్దే వుంటున్నాడు. ఇంట్లోనే పొద్దస్తమానం భార్యతో గొడవపడటమే కాకుండా ఆమెను అనుమానిస్తూ వేధింపులకు పాల్పడ్డాడు.
 
ఉద్యోగానికి అందుకే వెళ్తున్నావంటూ వేధింపులు తీవ్రతరం చేయడంతో ఆమె జాబ్ మానేసి ఇంట్లో వుంటోంది. బుధవారం నాడు భార్యాభర్తల మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరుకుంది. దాంతో అతడు ఆమెపై చేయి చేసుకున్నాడు. అతడి వేధింపులు తాళలేని హరిత ఇంట్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. తమ కుమార్తె చావుకి భర్త, అత్తమామల వేధింపులే కారణమని మృతురాలి తల్లి పోలీసులకి ఫిర్యాదు చేసింది. కోడలు ఆత్మహత్య, పోలీసు కేసు... అవమానంతో హరత మామయ్య పొలంకెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు. కాగా పెద్దకుమారుడు భార్య ఆత్మహత్యతో అజ్ఞాతంలోకి వెళ్లిపోగా రెండో కుమారుడు తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు