వచ్చేది జనసేన ప్రభుత్వమే.. వైసీపీ 15 సీట్లేకే పరిమితం: పవన్ కల్యాణ్

బుధవారం, 29 సెప్టెంబరు 2021 (22:09 IST)
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం ఖాయం... వచ్చేది జనసేన ప్రభుత్వమే అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ ఇప్పుడు 151 సీట్లతో ఉంది... తదుపరి 15 సీట్లకే పరిమితమవుతుంది అన్నారు. యుద్ధం ఖాయం... ఏ స్థాయిలో... ఎలా కావాలో వైసీపీ నేతలు కోరుకోవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీని తరిమేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 

వైసీపీ నాయకత్వానికి ఛాలెంజ్ చేస్తున్నా.... మీరో మేమో తేల్చుకుందాం రండి అని సవాల్ విసిరారు. బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... “తుమ్మెదల ఝూంకారాలు.. నెమళ్ల క్రీంకారాలు.. ఏనుగుల ఘీంకారాలు.. మా వీర మహిళల పదఘట్టనలు.. మా జనసైనికుల సింహగర్జనలు.. వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు.. గోంకారం అంటే మొరుగుట. గ్రామ సింహం అనే పదానికి నిఘంటువుల్ని పరిశీస్తే చాలా పదకోశాలు ఉన్నాయి.

గ్రామ సింహం అడవి సింహం కాజాలదు. సి.పి. బ్రౌన్ పదకోశం ప్రకారం గ్రామ సింహం అంటే కుక్కలు, వీధి కుక్కలు. శంకర నారాయణ తెలుగు డిక్షనరీ ప్రకారం పిచ్చి కుక్కలు, వీధి కుక్కలు. చివరిగా సూర్యరాయాంధ్ర నిఘంటువు ప్రకారం కరిచే కుక్కలు, అరిచి కరిచే కుక్కలు. ఇలాంటి అర్ధాలన్నీ పదకోశంలో ఉన్నాయి.
 
భయం అంటే ఎలా ఉంటుందో నేర్పిస్తాను
ఈ సన్నాసులకి... వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు నేర్పని సంస్కారాన్ని నేను నేర్పగలనా? కానీ సరిగా నూనూగు మీసాలు రాని కుర్రాళ్లు మాత్రం మీకు సంస్కారం నేర్పిస్తారు. ఈ వైసీపీ వ్యక్తులకి డబ్బు అధికారం అహంకారం పుష్కలంగా ఉన్నాయి. వారికి లేనిదల్లా భయం ఒక్కటే. ఆ భయం అంటే ఎలా ఉంటుందో నేను మీకు నేర్పిస్తాను.
 
అనాల్సినవన్నీ అనేసి కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతా.. బయటకి లాగి కొడతా.. కుదరకపోతే భారతీయ శిక్షా స్మృతి ప్రకారం మీకు చట్టపరంగా శిక్షలు పడతాయి. ఆ బాధ్యత జనసేన తీసుకుంటుంది. పార్టీ పెట్టిన నాటి నుంచి నేను చాలా బాధ్యతగా ఉంటున్నా. చాలా బాధ్యతగా మాట్లాడుతున్నా.

మాట తూలను. నాకు బూతులు రాక కాదు. మాట్లాడలేకా కాదు. మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడను. వైసీపీ వాళ్లకు మాత్రమే బూతులు వచ్చా. మీరు ఒక్క భాషలో తిడితే మేము నాలుగు భాషల్లో తిడతాం. ఒక్క రోజు సమయం ఇస్తే మీరు కోరుకున్న భాష నేర్చుకుని మరీ తిడతా.
 
బాబాయి వివేకాను ఎవరు చంపారు?
తెలంగాణలో ఒక సామెత ఉంది. అల్వాల్ ఎటుపోవాలి అంటే లేదన్నా నేను ఉల్వలు దున్నుతున్నా అన్నాడంట. అడిగేది ఏంటి అంటే.. వాడు కావాలని అలా చెబుతున్నాడు. అలాగే వైసీపీ వాళ్లను నేనేమడుగుతున్నా. మీ సొంత చిన్నాయన శ్రీ వివేకానందరెడ్డి గారు హత్యకు గురయ్యారు...  ఎవరమ్మా చంపింది అని అడుగుతున్నా. మరి ఆ రోజు కోడికత్తి వేసింది ఎవరు? ఆ రోజున అంత అరిచి గోల చేశారు.

కేంద్రం కంట్రోల్లో, నిఘా వ్యవస్థ కంట్రోల్లో ఉండి. భద్రతా వ్యవస్థ కంట్రోల్లో ఉంటే అంత గోల చేశారే.. అప్పటి గవర్నర్ శ్రీ నరసింహన్ గారు కూడా దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారుగా. ఇప్పుడు చెప్పండి సమాధానం. రివర్స్ టెండరింగ్ గురించి అడిగితే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతారు. నా వ్యక్తిగత జీవితం ఏముంది?  మీవి కదా రంగుల కలలు. నేనెప్పుడూ లైన్ దాటి మాట్లాడను.

మీ వైసీపీ అధినాయకుడు కూడా నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు. నేను మాట్లాడలేకా? నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పించారు. మీ అందరి సాక్షిగా చెబుతున్నా- మీ ఆడబిడ్డలకు చాలా గౌరవం ఇస్తా. వైసీపీ కార్యకర్త కుటుంబంలోని ప్రతి ఆడబిడ్డ నుంచి మీ అధినేత భార్య వరకూ అందరికీ గౌరవం ఇస్తాం.

అమ్మా నేను మీకు మాటిస్తున్నాను.. మీ వాళ్లు మాట తప్పుతారేమోగానీ మేము తప్పం. మిమ్మల్ని నేను ఒక్క మాట అనను. మా వాళ్లు అనరు. వైసీపీతోనే తేల్చుకుంటాం. పారిపోయే వ్యక్తులం కాదు. మీలా మాట తప్పం మడమ తిప్పం అని చెప్పడం కాదు ఆచరణలో చూపుతాం.
 
వైసీపీ వాళ్ళకే ఎక్కువ థియేటర్లు
మొన్న సినిమా టికెట్లు గురించి అడిగాను... నాకేమైనా థియేటర్లు ఉన్నాయా సన్నాసుల్లారా? రాష్ట్రంలో ఎక్కువ థియేటర్లు ఎవరికి ఉన్నాయి. వైసీపీ వాళ్లకే ఉన్నాయి. కాకినాడ, నెల్లూరులో థియేటర్లు వైసీపీ వాళ్లవు కావా? టికెట్లు రేట్లు పెంచితే నాకేంటి.. తగ్గిస్తే నాకేంటి? సినిమాలతో డబ్బు సంపాదించాలనే కోరిక నాకు ఏనాడూ లేదు.

నా మొదటి సినిమాకు కేవలం నెలకు రూ. 5వేలు మాత్రమే తీసుకున్నాను. జానీ సినిమాకు మొత్తం డబ్బులు వెనక్కి ఇచ్చేశాను. నేను అడిగింది టికెట్లు గురించి కాదు. ఒకరి కష్టార్జితాన్ని నువ్వెవ్వరు దోచుకోవడానికి అని అడిగాను.

మీరు పిల్లికి బిచ్చం వేయరు... ఎంగిలి చేత్తో కాకిని కొట్టరు
మీకు లక్ష కోట్లు ఉన్నాయని టీడీపీ వాళ్లు ఆరోపిస్తున్నారు. దానిని పక్కన పెడితే మీరే రూ. 700 కోట్లు ఉన్నాయని ప్రకటించారు. ఏం చేసుకుంటారు అంత డబ్బు. పేదలకు పంచొచ్చు కదా? మీరు ఇప్పటి వరకు పిల్లికి బిచ్చమేయడం మేము చూడలేదు. ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టరు. అంత పినాసివాళ్లు మీరు. అలాంటి మీరా మా గురించి మాట్లాడేది. మీరు ఎప్పుడైనా సైనిక బోర్డుకు కోటి రూపాయలు ఇచ్చారా?

మీరేమో మమ్మల్ని కొట్టొచ్చు, తిట్టొచ్చు. మేము మాత్రం ఒక్క మాట కూడా అనకూడదా? రాష్ట్రం మీ ఇడుపులపాయ ఎస్టేట్ కాదు. ఇది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా.. సర్వసత్తాక భారతదేశం గుర్తుపెట్టుకోండి. మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ గారికి తల వంచుతాం. సుబాష్ చంద్రబోసుకు తలదించుతాం. భగత్ సింగ్‌కు జోహార్లు అర్పిస్తాం. గాంధీజీకి మోకరిల్లుతాం. మీలాంటి వాళ్లకు తాటతీస్తాం. 

ఒక్క రోడ్డుకైనా మరమ్మతు చేశారా
ఒట్టి గొడ్డుకు అరువులెక్కువ వానలేని మబ్బుకు ఉరుములెక్కువ అన్నట్లు వైసీపీ నాయకులు అరుస్తున్నారు. ఏ రోజైనా ప్రజా సమస్యలపై దృష్టిపెట్టారా? మేము అడిగి నెల రోజులు అవుతుంది ఈ రోజుకి పాడైనా ఒక్క రోడ్డైనా మరమ్మతు చేశారా? ఈ రోజు మేము వస్తున్నామని తెలిసి ఏడు కిలోమీటర్ల మేర ధ్వంసమైన రోడ్డును హడావుడిగా రెండు రోజుల్లో వేసేస్తారా? మేము నమ్మాలా? 

వాళ్లు ఎంత పెద్దవాళ్లయినా అవ్వనివ్వండి... వేల కోట్లు ఉండనివ్వండి... మీ కింద కిరాయి సైన్యం పని చేయనివ్వండి.. అలాంటి వాటికి మాత్రం భయపడే వ్యక్తులమయితే మేము కాదు. తోడేళ్ల గుంపు జీతం లేకుండా గొర్రెలు కాపాలా కాస్తామంటే మనం నమ్ముతామా? అలాగే వైసీపీ వాళ్లు అవినీతి లేకుండా పాలన చేస్తామంటే నమ్ముతామా?  ఏటా రాష్ట్రానికి వచ్చే ఆదాయం లక్ష కోట్ల పైమాటే. ఈ లక్ష కోట్లు ఏం చేస్తున్నారు. జీతాలు సరైన సమయానికి ఇవ్వరు. పెన్షన్లు సమయానికి ఇవ్వరు. రెండో వారమో మూడో వారమో ఇస్తారు. ఇది ఇవాళ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి. దీని గురించి మాట్లాడితే వ్యక్తిగతంగా తిడతారు.

దాష్టీకాలు... దౌర్జన్యాలు చేసేవారే జనసేన శత్రువులు
ఒక రాజకీయ పార్టీ ఎదగాలన్నా, పోరాటం చేయాలన్నా వర్గ శత్రువు కావాలి. టీఆర్ఎస్ పార్టీకి వర్గ శత్రువులు ఆంధ్ర పాలకులు, వైసీపీ వాళ్లకు వర్గ శత్రువులు కమ్మవాళ్లు. జనసేన పార్టీకి వర్గ శత్రువు ఎవరని చాలా మంది నన్ను అడిగితే చెప్పడం చాలా కష్టమైంది. కానీ ఈ రోజు చెబుతున్నాను దాష్టీకానికి పాల్పడినవాళ్లు, దౌర్జన్యం, దోపిడి చేసిన వాళ్లు జనసేన పార్టీకి వర్గ శత్రువులు.

వాళ్లను ఎప్పటికీ మా ప్రత్యర్ధులుగానే భావిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి 151 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. అద్భుతమైన ప్రగతి సాధించాలి. కానీ వాళ్లు పాలనపై దృష్టి పెట్టకుండా ఇతరులను ఎదగనివ్వకుండా? ఒక కులాన్ని సమూలంగా తుడిచిపెట్టేద్దాం అంటే కుదిరే పనేనా? ఈ రోజు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి వర్గ శత్రువులు లేరు. 

కాపు ఉద్యమం ముసుగులోకి వైసీపీ చొరబడింది
కాపు రిజర్వేషన్లు మీద మీ స్పందన ఏంటి అని చాలా మంది నన్ను అడిగారు. తునిలో చిన్న పొరపాటు కారణంగా ఉద్యమం ఎటు కాకుండా పోయింది. ఆ రోజు మీటింగ్ సందర్భంలో రైలు పట్టాల మీదకు వెళ్లి ట్రైన్‌ను ధ్వంసం చేస్తారని ఎవరికీ ఊహించలేదు. ఉద్యమం ముసుగులో కొందరు వైసీపీ వర్గాలు దూరిపోయి చేసిన ధ్వంస రచన కారణంగా ఉద్యమం మసకబారిపోయింది. ఈ రోజుకి కూడా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో దళితుల హక్కులు కాలరాస్తున్నారు. నోరు మెదపలేని పరిస్థితులు ఉన్నాయి.

ఒక కులంపై కక్ష కడితే అది రాష్ట్రాన్నే దహించి వేస్తుంది. వైసీపీ చేస్తున్న తప్పు కూడా అదే. వారు వర్గ శత్రువుగా ప్రకటించుకున్న కమ్మవారితో జరుగుతున్న పోరాటంలో రాష్ట్రాన్ని, రాష్ట అభివృద్ధిని తగలబెట్టేస్తున్నారు. నన్ను ఒక్కసారి గెలిపించండీ అని నేను అడగను. నన్ను గెలిపిస్తే మాత్రం రాష్ట్రాభివృద్ధి, శాంతిభద్రతలు ఎలా ఉంటాయో మాత్రం చూపిస్తాను. 

రాష్ట్రాభివృద్ధి... ప్రజలకు న్యాయం కోసం...
రాష్ట్రాభివృద్ధి, ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటే నేను ఎవరితోనైనా కలుస్తాను. అవసరమైతే వ్యూహం మారుస్తాను. భారతీయ జనతా పార్టీతో కలిసినప్పుడు ఇదే అడిగాను. అమరావతిని రాజధానిగా కొనసాగించాలి. ఉత్తరాంధ్ర వెనుకబాటును తొలగించాలి. రాయలసీమ నుంచి వలసలను నిరోధించాలని కోరాను. వాళ్లు దానికి అంగీకరించడంతో వాళ్లతో కలిశాను.  

రాజకీయాల్లో నాకు ఎవ్వరూ లేరు. మా నాన్న గారు ముఖ్యమంత్రి కాదు. మా మామ గారు ముఖ్యమంత్రి కాదు. మా తండ్రి గారు కానిస్టేబుల్‌గా జీవితం మొదలు పెట్టారు. మా నాన్న నాకు వారసత్వంగా పెద్ద పెద్ద కారులు ఇవ్వలేదు. ఆస్తులు ఇవ్వలేదు. ఇడుపులపాయ లాంటి ఎస్టేట్లు ఇవ్వలేదు. వేల కోట్ల సంపాదన ఇవ్వలేదు. మా నాన్న నాకిచ్చింది ధైర్యం, తెగింపు, ధర్మపరిరక్షణ. ఇది మనందరి ప్రయాణం కాబట్టి బాధ్యతగానే తీసుకుంటాను. సమయం తీసుకున్నా జాగ్రత్తగానే ఉంటా. నేను నడిచి చూపిస్తా మీకు ఇష్టమైతే నాతోపాటు రండి.
 
నేను మిమ్మల్ని ఏం అడిగినా ఎప్పుడు అడిగినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మాత్రమే అడుగుతాను. నాకేంటి సరదా? నేనెప్పుడూ సినిమా హీరోని కాదు. నటుడిని అవ్వాలని కోరుకోలేదు. సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం తప్ప నాకేం తెలియదు.

ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్న అంశాన్ని త్రికరణశుద్దిగా నమ్మిన వాడిని. నేను తోటలో పాదును చాలా శుభ్రం చేసి కలుపు తీసి మొక్కని ఏపుగా ఎదిగేలా చేయగలను. అలాగే రాజకీయాల్లో కూడా కలుపు మొక్కల్ని తీసేసి బలమైన అభివృద్ధి వైపు తీసుకెళ్తాను. ఎలాంటి పని ఎంచుకున్నా అంతే శుభ్రంగా చేస్తాను.
 
ఎవరో  ప్రెసిడెంట్ మెడల్ ఇస్తారని నేను ఆ పని చేయను. ప్రెసిడెంట్ మెడల్ కోసం చాలా కష్టపడాలి. కార్గిల్‌లో యుద్ధం చేయాలి. పాకిస్థాన్ శత్రు మూకల్ని తరిమికొట్టాలి. సరిహద్దుల్లోకి చొచ్చుకు వచ్చే చైనా సేనల్ని తరిమి కొట్టాలి. అప్పుడే ప్రెసిడెంట్ మెడల్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రూ. 500 ఇస్తే ప్రెసిడెంట్ మెడల్ ఇస్తుంది.
 
నేను సమ సమాజం ఉండాలని కోరుకుంటాను. సమ సమాజం అంటే డబ్బు సంపాదించే వాడిని చావగొట్టి వాళ్లందరి ఎదుగుదలని ఆపేసి మొత్తాన్ని దరిద్రుల్ని చేయమని కాదు. ఎక్కడ ఉంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి. రోడ్లు వేయడానికి డబ్బు లేదు. రోడ్లు వేయరు. ఒక పొలిటికల్ పార్టీగా అడగడం మా హక్కు. మేము బాధ్యత తీసుకున్నాం. ఇన్ని కోట్లాది మంది ఆదరించే వారు ఉండగా నేను బాధ్యత తీసుకుని ప్రతి సన్నాసి చేత తిట్టించుకోవాల్సిన అవసరం లేదు.

నేను ఎందుకు తిట్టించుకుంటున్నాను. నా సమాజం, నా నేల మీద ప్రేమతో.. నేను ఆంధ్రప్రదేశ్‌లో పుట్టాను. తెలంగాణలో ఎదిగాను. కాబట్టి నా బాధ్యత ఇక్కడ వరకు నిర్వర్తిస్తున్నాను. నన్ను తిట్టేస్తే కింద కూర్చుని ఏడ్చేస్తానని అనుకుంటున్నారేమో.నేను మీరు తిట్టే కొద్దీ బలపడతాను తప్ప బలహీనపడను. బలహీపడకపోగా మీలో ఏ ఒక్కరినీ మర్చిపోను. నేను యుద్ధం ప్రకటించను. మీరు కావాలని లాగితే నేను వెనక్కి వెళ్లను.
 
ఇవన్నీ మన పన్నుల సొమ్మే
ఆ అన్నపథకం ఇస్తున్నాం.. మా అన్నపథకం ఇస్తున్నాం అని చెబుతున్నారు. ఇవన్నీ ఎవడబ్బ సొమ్ము. అదేమైనా మీరు చమటోడ్చి సంపాదించిన డబ్బా. మనమంతా ఉదయం లేచిన దగ్గర నుంచి పళ్ళు తోముకొనే బ్రెష్ దగ్గర నుంచి దేవుడికి వెలిగించే అగరబత్తి, టిఫిన్ చేసుకునే వంట నూనె వరకు అన్నింటికీ ట్యాక్సులు కడుతూనే ఉన్నాం. అది జీఎస్టీ కావచ్చు, సేల్ టాక్స్ కావచ్చు క్రయ విక్రయాల మీద వేసే టాక్స్ కావచ్చు. 60 గజాల స్థలం అమ్ముకున్నా కట్టాల్సిందే.

6 వేల ఎకరాలు సంపాదించుకున్నవాళ్లు ఆ టాక్సులు కట్టరేమో? ఇంత మంది టాక్సులు ఒక్క చోటుకు చేరతాయి. ఈ టాక్సులన్నీ కట్టి వెళ్తే అవన్నీ ప్రభుత్వ ఖజానాకు చేరి తర్వాత అభివృద్ధిపధం లోకి తెచ్చేలా వ్యయం చేయాలి.  అలా కాకుండా వీళ్లు నాకు ఓటు వేశారు వారికి పంచుతా వీళ్లు ఓటు వేయలేదు వీళ్లకి పంచను. రేషన్ కట్ చేస్తా అని అంటే మేము చూస్తూ ఊరకుంటామా? కిరాయి మూకల్ని, కోడి కత్తి గ్యాంగుల్ని పెట్టుకుని బాంబులతో దాడులు చేస్తామంటే మేము భయపడం.
 
అందరి చిట్టా సిద్ధం చేయండి
ఇక్కడున్న పార్టీ అధికార ప్రతినిధులకు కూడా చెబుతున్నాను. జనసేన పక్షాన మీడియాలో మాట్లాడడానికి వెళ్లేవారు కూడా బలంగా చెప్పండి. జనసేన పార్టీ గురించి ఇష్టానుసారం మాట్లాడితే తోలు తీస్తామని చెప్పండి. మీరు గుర్తుపెట్టుకోండి. మనల్ని ఇబ్బందిపెట్టిన వైసీపీ కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి వరకు అందరి చిట్టా రాసుకోండి. ఆ రోజు కాకినాడలో మా ఆడబిడ్డల మీద చెయ్యి చేసుకున్నారు మేం మర్చిపోలేము.

ఎవరు ఏం చేశారో మీకు దానికి దగ్గ ప్రతిఫలం ఇవ్వబడుతుంది. దీన్ని లా ఆఫ్ ఫిజిక్స్ అంటారు. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఎక్కడా మర్చిపోం. మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసు. మీరు బీహార్ నుంచి కిరాయి మూకల్ని తెప్పించుకోండి. వైసీపీవాళ్లు ఇప్పటి వరకు మనలాంటి వాళ్లను చూడలా. బూతులు తిడితే భయపడే ప్రసక్తే లేదు తోలు తీస్తాం జాగ్రత్త. మీ ఛానల్లో జనసేన పార్టీ పేరు చెప్పడానికే ఇష్టపడరు. ఏదో ఒక రోజు మీరు చెప్పేలా చేస్తా. చెప్పక తప్పదు.
 
ఎంతసేపు రాజకీయం రెండు వర్గాల మధ్య ఉంటుందేంటి నాకు అర్ధం కాదు. 70 సంవత్సరాలు పాలించిన తర్వాత అయినా మిగతా వర్గాల గురించి ఆలోచించాలి కదా? మిగతా వాళ్లు మనుషులు కాదా? ఒక పది సంవత్సరాలు వైసీపీ వర్గీయులు లేకపోతేనే గిజగిజలాడి పోతారు. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఏ కులాలు చూశాయి అధికారం. పెత్తనం ఒక్కరే చెలాయిస్తానంటే కుదరదు. ఒక్క కులమే శాసిస్తానంటే కుదరదు. ఆ రోజులు అయిపోయాయి.
 
కశ్మీర్ పండిట్లను తరిమినట్లు తరిమేయడం సాధ్యమా
సామాజిక న్యాయం అన్న మాటను అందరూ అడుగున పెట్టేశారు. నేను మర్చిపోను. అందరి కులాలకు సమన్యాయం చేసుకుంటూ వెళ్తాం. జనసేన పార్టీ నిలబడుతుంది పవన్ కళ్యాణ్ నిలబడతాడు. బతికున్నప్పుడు రక్షించుకోకుండా చనిపోయిన తర్వాత ఆ నాయకుడి గురించి మాట్లాడి ప్రయోజనం ఏంటి? 

వైసీపీ కేవలం కమ్మ వారి సమాజం మీద దాడి చేసుకుంటూ వెళ్తారా? మీరు కక్షతో  కశ్మీర్ లో కశ్మీర్ పండిట్లను తరిమేసినట్టుగా ఒక జాతిని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేద్దాం అంటే తప్పు కదా? అది కుదురుద్దా? మానవత్వమేనా? తప్పు కదా? అలాంటి బాధితులకు కూడా మేము అండగా ఉంటామని మాటిస్తున్నాం.
 
సినిమా పెద్ద విషయం కాదు
మీరు నన్ను యుద్ధానికి రమ్మని పిలిచారు. మీరు కవ్వించారు. కర్రలకు మేకులు గుచ్చి మా కార్యకర్తల తలకాయలు పగలగొట్టారు. మా ఆడబిడ్డల ఒంటి మీద చెయ్యేశారు. మా మధుసూదన్ రెడ్డి గారి లాంటి నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇలాంటి దాష్టికాలు అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు చేశారు.

గిద్దలూరులో మా కార్యకర్తను ఆత్మహత్య చేసుకునేలా చేశారు. మిమ్మల్ని వంగదీసి కింద కూర్చోబెట్టే రోజు దగ్గర్లోనే ఉంది గుర్తుపెట్టుకోండి. దళితుల మీదే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే స్థాయికి మీరు దిగజారారు. మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేయాల్సిన సమయం ఆసన్నమైంది.
 
నా సినిమాని ఉచితంగా వదిలేస్తా.. నా సినిమా పెద్ద విషయం కాదు. నేను నా కోసం నేనెప్పుడూ చేయను. పది మంది కోసం చేస్తాను. దీనికి ఎక్కడో ఒక చోట చరమాంకం పలకాలి వ్యూహం వేయాలి. వైసీపీ నాయకత్వానికి సవాలు విసురుతున్నా మీరు నా గురించి ఏం మాట్లాడుతారో మాట్లాడుకోండి. ఏం చేసుకుంటారో చేసుకోండి. దమ్ముతో మాట్లాడుతున్నా. వీలయితే ఆపుకోండి.

భవిష్యత్తులో మీకు గట్టిగా ఉంటుంది. వైసీపీ నాయకత్వానికి, మద్దతుదారులకు చెబుతున్నా.. వైసీపీ 2018లో చాలా మంది మద్దతుదారులు చాలా పెద్దలు మా వాడికి చేయవయ్యా అన్నారు. మనవాడు మనవాడు అనుకుంటే సరిపోదు. మనవాడికి గుణం ఉందా లేదా అన్నది కూడా గుర్తించాలి. గొడ్డలిలో దూరిన కర్ర కులాన్నంతా కొట్టేస్తుంది. కులం ప్రధానం కాదు. గుణం ప్రధానం.

మీరు ఎవరికి మద్దతిచ్చి తీసుకొచ్చారో ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఆ పాపంలో మీకు కూడా భాగం ఉంది గుర్తుంచుకోండి. మీరు చేసిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచించుకోండి. గుణం ప్రధానంగా వెళ్లండి. కులం ప్రధానం కాదు. గుణం ప్రధానం. గెలుపు ప్రధానం. అణగారిని వర్గాలకు అధికారం లేని వర్గాలకు ఇప్పటిదాకా నాయకత్వం వహించిన వర్గాలను గౌరవిస్తూనే.. మిగతా కులాలను అందలం ఎక్కించాలని కోరుకుంటున్నాను”.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు