చట్టసభల్లో నిర్మాణాత్మక, ప్రయోజనాత్మక చర్చలు జరగాలి : వెంకయ్య

శనివారం, 27 మార్చి 2021 (16:13 IST)
చట్టసభలు నిర్మాణాత్మక, ప్రయోజనాత్మక చర్చలకు వేదికలు కావాలే తప్ప, అంతరాయాలకు కాదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రముఖ విద్యావేత్త, పత్రికా సంపాదకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి నూకల నరోత్తమ్ రెడ్డి శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ సమావేశ మందిరంలో వెంకయ్యనాయుడు శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా శతజయంతి కమిటీ సభ్యులను అభినందించిన ఆయన, ఇలాంటి మహనీయుల జీవితం గురించి, సమాజానికి వారు చూపిన బాట గురించి ముందు తరాలకు తెలుసుకోవాలని, అందుకోసం ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పారు. చిన్నతనం నుంచే మంచి ప్రతిభ కనపరచిని నరోత్తమ్‌రెడ్డి సమాజసేవ మీద దృష్టి సారించి, రాజకీయాల్లోకి వచ్చారన్నారు.

నిజాం వ్యతిరేక పోరాటం మొదలుకుని ప్రజలను చైతన్య పరిచే అనేక ఉద్యమాల్లో వారు కీలక పాత్ర పోషించారని చెప్పారు. సురవరం ప్రతాపరెడ్డి ప్రారంభించిన గోలకొండ పత్రికకు సంపాదకులుగా ఆ పత్రికకు ప్రజాభిమాన్ని సంపాదించిపెట్టడంలో కీలక పాత్ర పోషించారన్న వెంకయ్యనాయుడు.. సురవరం నెలకొల్పిన విలువలు, ప్రామాణికత ఏ మాత్రం తగ్గకుండా పత్రికను ముందుకు తీసుకుపోయారని తెలిపారు.

రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యులుగా సేవలందించిన నరోత్తమ్‌రెడ్డి అనేక కీలక చర్చల్లో ప్రజా గళాన్ని వినిపించారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఆయన స్ఫూర్తిని ఈ తరం రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. విద్యారంగం పట్ల నూకల నరోత్తమ్‌రెడ్డి అమిత శ్రద్ధను కనబరిచారని, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రెండు దశాబ్ధాలు సిండికేట్ సభ్యుడిగా, మూడేండ్ల పాటు ఉపకులపతిగా సేవలు అందించి విశ్వవిద్యాలయ ప్రమాణాలు పెంచేందుకు కృషి చేశారని తెలిపారు.

56 ఏళ్ళ క్రితం రాజ్యసభలో నరోత్తమ్‌రెడ్డి ప్రసంగాలను వింటే.. దేశంలో విద్యాప్రమాణాలను పెంచేందుకు ఆయన పడిన తపన మనకు అవగతమౌతుందన్నారు. ఆనాటి నాయకులు పాటించిన ప్రమాణాలు, వారు అనుసరించిన విలువలు, నీతి-నిజాయితీకి కట్టుబడి సామాజిక అభ్యున్నతే ధ్యేయంగా వారు చేసిన కృషి చిరస్మరణీయమైనదన్న ఆయన, ఇలాంటి నాయకుల జీవితాలను యువత అధ్యయనం చేయాలని, వారు జీవితాంతం పాటించిన విలువలు, దేశభక్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా నూకల నరోత్తమ్‌రెడ్డి గారి శతజయంతి సంచికను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమ్మూద్ అలీ, తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య శివారెడ్డి, శతజయంతి కమిటీ కన్వీనర్ నూకల రాజేంద్రరెడ్డి సహా నూకల నరోత్తమ్‌రెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు