వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అధ్యక్షతన పని చేస్తున్న కామర్స్ పార్లమెంటరీ కమిటీ పనితీరును రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు అభినందించారు.
రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాల విరామ సమయంలో పలుమార్లు సమావేశమై మంచి పని తీరును కనబరిచినందుకు 8 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ప్రధానంగా కామర్స్ కమిటీ పార్లమెంట్ విరామ సమయంలో 10 సమావేశాలు నిర్వహించి గతంలో కంటే మంచి పనితీరు ప్రదర్శించిందని అన్నారు. కామర్స్ కమిటీ సగటున 2 గంటల 37 నిమిషాల చొప్పున మొత్తం 26 గంటల 18 నిమిషాలపాటు సమావేశమైందని ఆయన తెలిపారు.
గతంలో కామర్స్ కమిటీ సమావేశాలు సగటున 1 గంట 42 నిమిషాలు మాత్రమే జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గతంతో పోల్చుకుంటే ఈసారి కామర్స్ కమిటీ పనితీరులో గణనీయమైన పెరుగదల ఉన్నట్లు ఆయన తెలిపారు.