ఈసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రతిష్ఠాత్మకం

శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (09:40 IST)
కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు  షెడ్యూల్‌ జారీ చేయడంతో ఉపాధ్యాయ వర్గంలో ఆసక్తి నెలకొంది. ఈసారి మెజార్టీ ఉపాధ్యాయ సంఘాలు ఒక అభ్యర్థికి గంపగుత్తగా మద్దతు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో అభ్యర్థులకు ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకం కానుంది.

గతంతో ఎవరో ఒకరి పక్షాన మెజార్టీ సంఘాలు నిలబడేవి. ఈసారి ఆ పరిస్థితి లేదు.పోటీ బరిలో నిలవాలనుకున్న అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాలు ప్రారంభించారు. ఈ స్థానం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఏఎస్‌ రామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

తిరిగి మరోసారి పోటీ బరిలో నిలవనున్నట్లు ప్రకటించి ప్రచారం సాగిస్తున్నారు. టీచర్లతో పాటు అమరావతి పరిరక్షణ సమితి నుంచి రాజధాని ప్రాంతవాసులకు మద్దతుగా నిలుస్తున్న ప్రముఖ ఆడిటర్‌ మల్లికార్జునరావు కూడా పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

ఆయనకు ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘంలో ఓ వర్గం మద్దుతిస్తోంది. ఉపాధ్యాయ సంఘం నేతగా సుదీర్ఘ అనుభవం గడించి అనేకమార్లు ఫ్యాప్టో తరఫున ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చలు జరిపిన వారిలో కీలకంగా వ్యవహరించిన ఏపీటీఎఫ్‌ ఉద్యమ నాయకుడు పాండురంగ వరప్రసాద్‌ పోటీలో ఉన్నారు.

ఆయనకు ఏపీటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘం వెన్నంటి నిలుస్తోంది. యూటీఎఫ్‌ సంఘం మద్దతుతో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఈయన గెలుపు బాధ్యతలను గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ లక్ష్మణరావు చూస్తున్నారు. పీఆర్‌టీయూలోని ఓ వర్గం మద్దతుతో కల్పలత పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే ఆమె ప్రచారపర్వంలో ఉన్నారు. అధికార, విపక్షాలు ఎవరికీ మద్దతు ప్రకటించే పరిస్థితి లేదని ఉపాధ్యాయుల్లో చర్చ నడుస్తోంది.
 
మార్చి 14న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు
కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గం శాసనమండలి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ను గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌  ప్రకటించారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 16న నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నట్లు తెలిపారు.

నామినేషన్లు దాఖలుకు ఈనెల 23వ తేదీ వరకు గడువు, 24న పరిశీలన, ఉపసంహరణకు 26వ తేదీ వరకు గడువు ఉరదన్నారు. మార్చి 14న ఎన్నికలు జరుగుతాయన్నారు.

పోలింగ్‌ సమయం ఉదయం 8.00 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని మార్చి 17న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం ఓటర్లు 13,130 ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు