జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలను ప్రశ్నించడం ఊపందుకున్నది. ఉత్తరాంధ్ర పర్యటనలో వున్న పవన్ కళ్యాణ్ పలు అంశాలపై మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీ గురించి కూడా గుర్తు చేసుకున్నారు. అప్పట్లో పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ప్రజార్యాజ్యం పార్టీలో స్వేచ్ఛలేదని అప్పట్లో పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారనీ, పార్టీ కార్యాలయంలోనే పరకాల ప్రభాకర్ పార్టీని తిట్టాడని... మరలాంటప్పుడు పార్టీలో స్వేచ్ఛ ఉన్నట్లా? లేదా? అని కార్యకర్తలనుద్దేశించి ప్రశ్నించారు.
పరకాల ప్రభాకర్ లాంటి వారికి కరెక్ట్ సమయం చూసి తగిన గుణపాఠం చెబుతానని అన్నారు. రాజకీయ పార్టీల్లో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయనీ, వాటిని సరిదిద్దుకుంటామన్నారు. ఐతే తను పొరపాట్లు చేయవచ్చునేమోగానీ తప్పులు మాత్రం చేయనన్నారు. ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో పరాజయం పాలవడం తనకు ఎంతో బాధ కలిగించిందనీ, ఐతే ఆ ఓటమికి కారణమైన ఏ ఒక్కరిని కూడా తను మర్చిపోలేనని అన్నారు. రాజకీయాల్లో నాయకులకు సహనం, ఓర్పు, విజ్ఞత చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.