తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి వార్తల్లోకెక్కారు. ఎప్పుడూ ఏదో ఒక వ్యవహారంలో తలదూర్చి నెత్తిపైకి తెచ్చుకునే రమణ దీక్షితులు ఇప్పుడు అదే పనిచేశారు. కుమారులు విధులకు హాజరు కాకపోయినా వారిని వెనకేసుకొచ్చే రమణదీక్షితులు టిటిడి నిబంధనలను తుంగలో తొక్కేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఆరు నెలలుగా రమణ దీక్షితులు కుమారులు రాజేష్, వెంకటపతి దీక్షితులు తిరుమల శ్రీవారి ఆలయంలో విధులకు హాజరు కాలేదని తెలుస్తోంది.
ఆలయంలో స్వామివారి అభిషేకాలు, కైంకర్య కార్యక్రమాలను రమణ దీక్షితులతో పాటు వీరి ఇద్దరి కుమారులు చూస్తున్నారు. వీరు ఎవరూ టిటిడి ఉద్యోగస్తులు కారు. ఆగమ శాస్త్రబద్ధంగా స్వామివారికి సేవ చేయడమే వీరి పని. అలాంటి వారు ఎంతో నిబద్ధతతో పనిచేయాలి. కానీ రమణ దీక్షితులు ఇద్దరు కుమారులు విధులకు హాజరు కాకపోవడం, సరిగ్గా పనిచేయక పోవడంతోనే అసలు సమస్య వచ్చి పడుతోంది. టిటిడి గతంలో ఎన్నిసార్లు హెచ్చరించినా వీరిలో మాత్రం మార్పు రాలేదు. దీంతో టిటిడి ఉన్నతాధికారులు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయానికి ఇద్దరినీ బదిలీ చేశారు.