శ్రీవారి భక్తులకు ఇది శుభవార్తే. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగష్టు 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మహాసంప్రోక్షణ బాలాలయంను నిర్వహించేందుకు టిటిడి సిద్థమైన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో భక్తులెవరినీ దర్శనానికి అనుమతించకూడదన్న నిర్ణయం కూడా తీసేసుకుంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి సంప్రోక్షణ జరిగే సమయంలో కూడా భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతించాలని ఆదేశించారు. దీంతో టిటిడి పాలకమండలి తిరుమలలో సమావేశమైంది.
ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆగష్టు 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మహాసంప్రోక్షణ జరుపనున్నట్లు టిటిడి ఛైర్మన్ తెలిపారు. 11వ తేదీ 9 గంటల సమయం, 12వ తేదీ 4 గంటల సమయం, 13వ తేదీ 4 గంటల సమయం, 14వ తేదీ 6 గంటల సమయం, 15వ తేదీ 5 గంటల సమయం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. మిగిలిన సమయాల్లో మహాసంప్రోణ నిర్వహించనున్నారు. సంప్రోక్షణ సమయంలో సిఫార్సుల లేఖలను స్వీకరించకూడదన్న నిర్ణయానికి కూడా వచ్చేశారు.