తిరుమల గిరులను నిర్మానుష్యం చేయం : తితిదే ఛైర్మన్ సుధాకర్

ఆదివారం, 15 జులై 2018 (15:56 IST)
తిరుమల శ్రీవెంకటేశ్వరుని ఆలయంలో వచ్చేనెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మహాసంప్రోక్షణం కార్యక్రమం జరుగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఈ మహాఘట్టం సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని నిలిపివేయనున్నారు.
 
నిజానికి స్వామి దర్శనం పూర్తిగా నిలిపేయాలని నిర్ణయం తీసుకున్న టీటీడీ, తొలుత నడక మార్గాలను మూసివేయాలని భావించింది. ఇలా చేయడం వల్ల తిరుమల పూర్తిగా నిర్మానుష్యంగా మారే ప్రమాదం ఉంది. దీంతో ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గింది. తిరుమల గిరులను చూసేందుకు వచ్చే భక్తులు ఇతర ఆలయాలు, పవిత్ర ప్రదేశాలను దర్శించుకుని వెళ్లే అవకాశాన్ని కల్పించనుంది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, యాత్రికులను, భక్తులను అడ్డుకోబోమని, అయితే, స్వామి దర్శనం మాత్రం లభించదని తెలిపారు. ఇదే విషయంపై తిరుపతి, అలిపిరిలో కరపత్రాలను పంచి పెడతామన్నారు. తిరుమలకు వచ్చే భక్తులపై ఎలాంటి ఆంక్షలూ ఉండవన్నారు. మహా సంప్రోక్షణం జరిగే రోజుల్లో సుప్రభాత సేవ ఏకాంతంగా ఉంటుందని, మిగతా అన్ని ఆర్జిత సేవలూ రద్దు చేశామని, సాధారణ భక్తులతో పాటు... వీఐపీ దర్శనాలకు కూడా నిలిపివేసినట్టు ఆయన తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు