తిరుపతి ఉప ఎన్నికల ఎగ్జిట్ పోల్.. వైకాపాదే గెలుపు.. పవన్‌కు షాక్..?
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (13:47 IST)
తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తెలిపే ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల అయ్యాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి.. అధికార పార్టీ అంచనాలు నిజమవుతున్నాయా? అనే విషయాలపై అంచనా వేసింది ఆరా సంస్థ. ఎవరికి ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉందో అంటూ అంచనాలను చెప్పింది.
తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగిన తిరుపతి ఉప ఎన్నికలో అధికార వైసీపీ భారీ విజయం సాధిస్తున్నట్టు ఆరా సంస్థ ప్రకటించింది. అందరూ ఊహించినట్టే.. మంత్రులు చెబుతున్న లెక్కలు కూడా నిజమవుతాయని ఆరా సంస్థ చెప్పింది.
ఆ సంస్థ అంచనా ప్రకారం... వైసీపీకి 65.85 శాతం ఓట్లు దక్కించుకుందని అంచనా వేసింది. అంటే మంత్రులు చెబుతున్నట్టు భారీ మెజార్టీతో వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి విజయం ఖాయమని ఆ సంస్థ జోస్యం చెప్పింది.
ఇక వరుస ఓటములతో డీలా పడ్డ టీడీపీకి మరో షాక్ తప్పదని ఆ సంస్థ తేల్చేసింది. గట్టి పోటీ ఇస్తుందని అంతా అంచనా వేసిని ప్రధాన ప్రతిపక్షానికి కేవలం 23.10 శాతం ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెప్పింది. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై టీడీపీ మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
అధికార వైసీపీ నేతలు భారీగా దొంగ ఓట్లు వేయించారని.. తిరుపతి అసెంబ్లీ పరిధి వరకు మళ్లీ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల అధికారులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది. అయితే కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్నది పక్కన పెడితే.. భారీగా ఓట్లు పడతాయని ఆశించిన టీడీపీకి తిరుపతి ఓటర్లు షాకిచ్చినట్టే అని ఆరా సంస్థ లెక్కలు చెబుతున్నాయి.
తిరుపతి ఉప ఎన్నికపై కమలం పార్టీ భారీగానే ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో దుబ్బాక స్ఫూర్తితో తిరుపతిలో గెలుపొంది ఏపీలో అడుగు పెట్టాలని బీజేపీ ఆశించింది. ముఖ్యంగా జనసేనతో పొత్తు, యువత, సామాజిక సమీకరణాలు బాగా కలిసి వస్తాయని అంచనా వేస్తోంది. కనీసం గెలవకపోయినా సెకెండ్ ప్లేస్ అయితే తమదే అని స్థానికంగా లీడర్లు చర్చించుకున్నట్టు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ప్రచారం కలిసి వస్తుందని ఆశించింది. కానీ తిరుపతి ఓటర్లు మాత్రం బీజేపీ ఊహించని షాక్ ఇచ్చారని ఆరా సంస్థ అంచనా వేసింది. ఆ పార్టీకి కేవలం కేవలం 7.34 శాతం ఓట్లే వస్తున్నట్టు చెప్పింది. ఇక కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు 3.71 శాతం ఓట్లు వచ్చినట్లు చెప్పింది.