తిరుపతి పట్టణంలోనే కాకుండా రాష్ట్రంలోని మంచి ఆస్పత్రిగా గుర్తింపు పొందిన దావఖానాల్లో రుయా ఆస్పత్రి ఒకటి. కానీ, సోమవారం రాత్రి ఈ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక నిమిషాల వ్యవధిలోనే 11 మంది మృతి చెందారు. అయితే, ఆక్సిజన్ అందక చనిపోయింది 11 మంది కాదనీ మరో 18 మంది వరకు ఉన్నారని ప్రాణాలతో బయటపడిన బంధువులు కూడా ఉన్నారు.
మరోవైపు, రుయాలో 11 మంది చనిపోవడం వెనుక పూర్తి నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. చెన్నై నుంచి రుయా ఆస్పత్రికి రాత్రి 7 గంటలకు ఆక్సిజన్ ట్యాంకర్ రాగా 7.30 గంటలకు ఫిల్లింగ్ ప్రారంభించారు. దీంతో ఆక్సిజన్ సఫరాలో ఒత్తిడి తగ్గిపోయింది.
రాత్రి 7.40 గంటలకు తమ వాళ్లకు ఏదో అయిందని రోగుల బంధువులు గుర్తించారు. రాత్రి 7.45 గంటలకు కొందరు రోగులు ప్రాణాలు విడిచారు. రాత్రి 7.50 గంటలకు రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి సిబ్బందిపై దాడికి దిగారు. రాత్రి 8.15 గంటలకు నర్సులు పారిపోగా, రాత్రి 11 గంటలు కలెక్టర్ ఆస్పత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.