నేడు, రేపు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు

శనివారం, 28 ఆగస్టు 2021 (12:59 IST)
శనివారం, ఆదివారం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా కురుస్తాయని అమరావతి వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

శనివారం విశాఖపట్నం, తూర్పు గోదావరి, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో, ఆదివారం విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.

వాతావరణశాఖ అధికారుల వివరాల మేరకు... పశ్చిమ బెంగాల్‌ తీరానికి సమీపంలోని వాయవ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు.

దీని ప్రభావంతో శనివారం వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. ఈ కారణంగా శని, ఆదివారాల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా కురుస్తాయని పేర్కొన్నారు.

గడిచిన 24 గంటల్లో గారలో 11.8 సెంటీమీటర్లు, గుమ్మలక్ష్మీపురంలో 8.3, కళింగపట్నంలో 8.0, పాలకొండలో 7.9, ఇంకొల్లులో 7.5, శ్రీకాకుళంలో 7.0, నూజెండ్లలో 6.4, కురుపాంలో 5.8, సీతంపేట, అద్దంకి, వేటపాలెంలో 5.1, మద్దిపాడులో 5.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు