సచిన్ కోసం సజ్జగారెలు... వేరుశనక్కాయలు సిద్ధం... : దత్తత గ్రామ మహిళ

బుధవారం, 16 నవంబరు 2016 (09:00 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన దత్తత గ్రామానికి బుధవారం రానున్నారు. ఇందుకోసం ఆ గ్రామం సర్వాంగ సుదంరంగా ముస్తాబైంది. నెల్లూరు జిల్లా పుట్టంరాజుకండ్రిగను సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న విషయంతెల్సిందే. దీంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఆ గ్రామ ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 
 
అయితే, సచిన్ రాక గురించి తెలుసుకున్న ఓ మహిళ మాట్లాడుతూ సచిన్ తమకు దేవుడితో సమానం. ముళ్ల పొదలతో నిండిన తమ గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దారు. తన కుమారుడు మహేష్‌ వివాహం ఆయన చేతుల మీదుగా చేయాలని అనుకున్నా కానీ, ఆయన వస్తారో? రారో? అన్న అపనమ్మకంతో ముహూర్తం మార్చాం. యేడాది తర్వాత వస్తానని సచిన్ చెప్పినా, గ్రామంలో వాళ్లు ఖరారు చేయకపోవడంతో అలా చేయాల్సి వచ్చిందన్నారు. 
 
గతేడాది సచిన్ వచ్చినప్పుడు తాను మాట్లాడుతుంటే తెలుగు రాదని సచిన్ చెప్పారని, అధికారులు తన మాటలు తర్జుమా చేశారని గుర్తుచేసుకుంది. అప్పుడు సచిన్‌కు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయానని, ఇప్పుడు మాత్రం అలా కాదని, పూల గుత్తితో స్వాగతం పలుకి, శాలువతో సత్కరిస్తానని చెప్పుకొచ్చింది. 
 
అంతేనా.. సచిన్ కోసం ఇప్పటికే సజ్జ గారెలు (వడలు) చేశానని, వేరుశనక్కాయలు ఉడకపెట్టి ఇస్తానని, కొబ్బరినీళ్లు కూడా ఆయనకు ఇస్తానని ఆమె చెప్పింది. ఆయన కారణంగా గ్రామం బాగుపడిందని చెప్పిన ఆమె, తమ గ్రామ ప్రజల జీవనశైలి మాత్రం మెరుగుపడలేదని ఆవేదన వ్యక్తం చేసింది. 

వెబ్దునియా పై చదవండి