హాస్య నటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ రాజ్ ఓ మహిళతో కొనసాగించిన సరస సంభాషణ ఇపుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎస్వీబీసీ ఛానెల్‌లో పని చేస్తున్న ఓ మహిళతో ఆయన ఈ సరస సంభాషణ కొనసాగించి.. తాను భక్తి స్వామిని కాదని, రక్తి స్వామినంటూ నిరూపించారు. ఈ ఆడియో వైరల్ కావడంతో పవిత్ర పుణ్యక్షేత్రమైన తితిదే విజిలెన్స్ రంగంలోకి దిగింది. ఈ ఆడియో వ్యవహారం పెను సంచలనం సృష్టించడంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి విచారిస్తున్నారు. ఆడియో టేపుల వ్యవహారంపై టీటీడీ విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ రామ్ కిశోర్ అంతర్గత విచారణ చేపట్టారు. అసలేం జరిగింది? లైంగిక వేధింపుల ఆరోపణల్లో నిజమెంత? ఎస్వీబీసీ మహిళా ఉద్యోగులను లోబర్చుకున్నారా? అనే వివరాలు ఆరా తీస్తున్నారు. ఎస్వీబీసీ ఉద్యోగులను ఒక్కొక్కరిగా పిలిచి విజిలెన్స్ అధికారులు విచారించినట్టు సమాచారం.
మరోవైపు, ఈ వ్యవహారం ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్టు తితిదే ఛైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ ఆడియో టేపుల వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. ఇదే అంశంపై ఆయన ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ, ఈ విషయం ఈ ఉదయమే తన దృష్టికి వచ్చిందన్నారు. ఆ మరుక్షణమే పృథ్వీతో మాట్లాడినట్టు చెప్పారు.
నివేదిక అందిన తర్వాత సీఎంకు తెలిపి.. ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీలో ఎస్వీబీసీ అంతర్భాగమని.. హరినామ కీర్తనలు, స్వామి వారి సేవలు ప్రపంచంలో కోట్లాది మంది వీక్షిస్తున్నారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు. సీఎం దృష్టికి వెళ్లినట్టు తెలిసిందని.. ఆయన ఆదేశాల మేరకు ఏ చర్యలైనా ఉంటాయని ఎస్వీ సుబ్బారెడ్డి వెల్లడించారు.