జీఎంసీ బాలయోగి ఆస్తులు కాజేశానన్నది నిజమే : కేశినేని నాని

మంగళవారం, 16 జులై 2019 (09:30 IST)
లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి ఆస్తులు కాజేశానంటూ తనపై కొందరు చేస్తున్న ప్రచారంపై తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. ఆయన ఆస్తులు కాజేసింది నిజమేనని చెప్పారు. పైగా, నీతి, నిజాయితీ, ఉన్నతమైన విలువలు, సిద్ధాంతాలు కలిగిన జీఎంసీ బాలయోగి ఆస్తులను తాను కాజేసినందుకు గర్వపడుతున్నట్టు నాని చెప్పుకొచ్చారు. 
 
టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు, కేశినేని నానికి మధ్య సోషల్ మీడియా వేదికగా ప్రచ్ఛన్నయుద్ధం సాగుతోంది. ముఖ్యంగా, కేశినేని నానిని లక్ష్యంగా చేసుకుని బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. "దళిత నాయకుడు మాజీ స్పీకర్ బాలయోగి ఆస్తులన్నీ కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు. ఒకే నంబర్‌పై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా. నేను చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి వినే ధైర్యం నీకుందా?" అంటూ ఆయన ప్రశ్నించారు. 
 
దీనికి ప్రతిగా కేశినేని నాని స్పందించారు. "నేను బాలయోగి ఆస్తులు కాజేశానని ఒక ప్రబుద్ధుడు చెప్పింది యదార్థం. బాలయోగికి ఉన్న ఆస్తులు నీతి, నిజాయితీ, విలువలు, సిద్ధాంతాలు, ప్రజల్ల పట్ల అంకితభావం, ప్రాంతాన్ని అభివృద్ధి చేసే చిత్తశుద్ధి. వీటిని కాజేసి పాటిస్తునందుకు చాలా గర్వ పడుతున్నాను" అంటూ కౌంటరిచ్చారు. మరోవైపు, ఈ ట్వీట్ల యుద్ధం ఆపాలంటా పార్టీ అధిష్టానం చెబుతున్నా వీరిద్దరు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు