నీకు ఆమోదయోగ్యం కాకపోతే ఆ పని చెయ్యి : కేశినేనికి పీవీపీ కౌంటర్

బుధవారం, 7 ఆగస్టు 2019 (11:36 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన ఆర్టికల్ 370 రద్దుతో పాటు ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించే బిల్లుకు మంగళవారం పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. ఈ చర్యను టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్రంగా తప్పుబట్టారు. నిజానికి ఈ బిల్లుకు టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కానీ, కేశినేని నాని మాత్రం ఈ బిల్లును ఆమోదించి కాశ్మీర్ ప్రజల గొంతు నొక్కారంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై కేశినేని నాని ఓ ట్వీట్ చేశారు. 'కాశ్మీర్ విషయంలో జరిగిన తీరు ఆమోదయోగ్యం కాదు. ఆ రోజు ఆంధ్ర ప్రజల గొంతు నొక్కారు. ఈ రోజు కాశ్మీర్ ప్రజల గొంతు నొక్కారు. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా, గులాంనబీ ఆజాద్, ఒమర్ అబ్దుల్లా వంటి కాశ్మీరీ నాయకులకైనా వారి వాదన వినిపించే అవకాశం ఇచ్చి, తర్వాత చేయవలసింది చేస్తే ఆక్షేపణ వుండేది కాదు' అని అభిప్రాయపడ్డారు. 
 
దీనికి వైకాపాకు చెందిన నేత, సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త పీవీపీ వరప్రసాద్ గట్టిగానే కౌంటరిచ్చారు. 'చిట్టచివరకు జాతి అభిప్రాయం పార్లమెంట్‌లో ప్రతిబింభించింది. నీకు ఆమోదయోగ్యం కాకపోతే ఆ పని చెయ్యి. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకో. ఆ రాష్ట్రానికి నిరాశా నాయకులు ఏం చేశారు... 72 ఏళ్ల రక్తపాతం! దయచేసి రాహుల్ పండితా రచించిన 'అవర్ మూన్ హాజ్ బ్లడ్ క్లాట్స్' చదువు. నీ కళ్లు తెరచుకుంటాయి' అని వ్యాఖ్యానించారు. 
 
కాగా, గత ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి వైకాపా తరపున పీవీపీ, టీడీపీ తరపున కేశినేని నానిలు పోటీ చేయగా, వీరిలో కేశినేని నాని అతి తక్కువ ఓట్లతో బయటపడ్డారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య ట్వీట్టర్ వార్ సాగుతోంది. ఇప్పటికే పలు అంశాలపై వారు ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు చేసుకున్నారు. ఇపుడు కాశ్మీర్ అంశంపై కూడా ఘాటైన ట్వీట్స్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

 

Will of the nation was finally reflected in parliament.నీకు ఆమోదయోగ్యం కాకపోతే అన్ని మూసుకుని,listen to the pulse of the people!72 years of bloodshed, what has all those hopeless leaders done for their people. Please read 'Our Moon Has Blood Clots' by Rahul Pandita,an eye opener

— PVP (@PrasadVPotluri) August 6, 2019

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు