ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించగా, నలుగురు గాయపడ్డారు. గురువారం ఫిషింగ్ హార్బర్ సమీపంలోని బుక్క వీధి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, కొంతమంది కార్మికులు వెల్డింగ్ పనిలో ఉన్నప్పుడు పేలుడు సంభవించింది.
ఈ పేలుడుతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలు పరుగులు తీశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు, వారి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.
విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, కలెక్టర్ హరింధీర ప్రసాద్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఈ సంఘటనపై వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం నుండి అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
స్క్రాప్ దుకాణం యజమాని గణేష్, పక్కనే ఉన్న దుకాణం యజమాని శ్రీను మరణించారని అధికారులు తెలిపారు. స్క్రాప్ దుకాణంలో పనిచేస్తున్న రంగా, యెల్లాజీ, సన్యాసి, ముత్యాల తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కింగ్ జార్జ్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.