భవిష్యత్‌లో కరెన్సీ నోటు ఉండదు.. అంతా డిజిటలైజేషనే.. : మంత్రి వెంకయ్య

ఆదివారం, 18 డిశెంబరు 2016 (11:41 IST)
దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దుతో ఇబ్బందులు ఉన్న మాట వాస్తవేమనని, అయితే, క్రమంగా ఇవి తొలగిపోతాయని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ముఖ్యంగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం ఓ విప్లవాత్మకమన్నారు. భవిష్యత్‌లో కరెన్సీ నోటు అనేది కంటికి కనిపించదనీ, మొత్తం డిజిటలైజేషన్ అవుతుందన్నారు. అయితే, పరిమిత స్థాయిలో మాత్రమే కరెన్సీ నోటు లావాదేవీలను అనుమతించే అవకాశం ఉందన్నారు. 
 
ఆదివారం కృష్ణా జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ప్రధాని మోడీ నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతించారని, ఇబ్బందులు తాత్కాలికంగా ఉన్నా దీర్ఘకాలంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. నోట్ల రద్దుతో అవినీతిని, నల్లధనాన్ని నివారించవచ్చని, గతంలో కొంతమంది మాత్రమే పన్నులు కట్టేవారని, ఇప్పుడు ప్రతి ఒక్కరూ పన్నులు కడుతున్నారన్నారు. 
 
అలాగే నగదు రహిత లావాదేవీల స్థాపనే ప్రభుత్వ లక్ష్యమని, డిజిటల్‌ లావాదేవీలకు అన్ని రాష్ట్రాలు సహకరించాలన్నారు. పార్లమెంట్‌లో నోట్ల రద్దుపై చర్చకు విపక్షాలు సహకరించి ఉంటే బాగుండేదని, విపక్షాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని మంత్రి వెంకయ్య వ్యాఖ్యానించారు. 
 
దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందాలని, రూ.లక్ష వరకు ఉచిత వైద్యం అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యంపై దృష్టి సారించాలని, అలాగే చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం మెరుగ్గా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. 

వెబ్దునియా పై చదవండి