43 రోజులు గడిచినా గడ్డి కరుస్తున్నాం... ATM నుంచి అన్ లిమిటెడ్ విత్ డ్రా అంట, నమ్ముదామా...?

బుధవారం, 21 డిశెంబరు 2016 (22:14 IST)
గంటలకొద్దీ ATM క్యూలో ఉంటే వచ్చేది కేవలం రెండు వేల రూపాయల నోటు మాత్రమే. ఆ నోటుకు చిల్లర దొరకటం దేవుడెరుగు.. ఇంటి అద్దె చెల్లించటం కోసం కూడా మూడు రోజులు ATM చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది. నోట్ల రద్దు ప్రకటించి 43 రోజులు గడిచినా డబ్బులు తీసుకునేందుకు గడ్డి కరవాల్సి వస్తోంది. ఐతే ఇక నుంచి అలాంటి తిప్పలు ఉండవు అంటోంది ఆర్థిక శాఖ. న్యూ ఇయర్ గిఫ్ట్ కింద.. ATM విత్ డ్రా లిమిట్ ఎత్తివేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చింది. రూ.2వేల నోట్లు జనం అందరికీ చేరాయని.. రెండు రోజులుగా దేశవ్యాప్తంగా రూ.500 నోట్లు పంపిణీ ఉధృతం చేసినట్లు ప్రకటించారు అధికారులు. 
 
అన్ని ATMలను అందుబాటులోకి తీసుకొచ్చి.. విరివిరిగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్లోకి 500 నోట్లు రాకతో చిల్లర సమస్య కూడా తీరిపోతుందని భావిస్తోంది. దీంతో జనవరి ఒకటో తేదీ నుంచి ATM విత్ డ్రా లిమిట్ ఎత్తివేయాలనే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. మొత్తానికి న్యూఇయర్‌లో అయినా క్యూ బాధలు తప్పుతాయని భావిస్తున్నారు జనం. మళ్లీ నెల వస్తుంది.. జీతాల టైం కావటంతో ముందస్తుగా భారీ ప్రణాళికతో ముందుకు వస్తామంటోంది కేంద్రం. కొత్త ఏడాదిలో నోట్ల కష్టాలు లేకుండా చూస్తామని గట్టిగా చెబుతోంది.

వెబ్దునియా పై చదవండి