కృష్ణా జడ్పీ ఛైర్మన్ పీఠం ఉప్పాల హారిక‌కే!

శనివారం, 25 సెప్టెంబరు 2021 (13:43 IST)
ఎడ‌తెగ‌ని రాజ‌కీయ ఉత్కంఠ అనంత‌రం, ఎట్ట‌కేల‌కు కృష్ణా జడ్పీ ఛైర్మన్ పీఠం ఉప్పాల హారిక‌కే ద‌క్కింది.  పెడన నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ఉప్పాల రాంప్రసాద్ కోడలు ఉప్పాల హారిక గుడ్లవల్లేరు జడ్పీటీసీగా విజయం సాధించారు. తొలి నుండి జడ్పీ చైర్మన్ పీఠం మాదే అన్న రీతిలో ఉప్పాల కుటుంబం ఎన్నికల ప్రచారం చేసి ఘన విజయం సాధించింది. అధిష్టానం కూడా ఉప్పాల కుటుంబానికే అన్నట్టు పరోక్షంగా చెప్పుకొచ్చింది. తీరా ఫలితాలు వెలువడిన తర్వాత కొంత సందిగ్ధం ఏర్పడింది. 
 
జనరల్ మహిళకు రిజర్వు అయిన చైర్మన్ పీఠాన్ని బీసీలకు ఇవ్వడమేమిటన్న ప్రశ్న వైసీపీ కాపు నేతల నుండి అంతర్గతంగా వినిపించింది. కాపు సామాజిక వర్గానికి చెందిన దుట్టా రామచంద్రరావు కుమార్తె,  సీతా మహాలక్ష్మికి చైర్మన్ పదవిని కట్టబెట్టాలని పావులు కదిపారు. ఈ విషయం తెలుసుకున్న ఉప్పాల రాంప్రసాద్ తన కోడలు హారికను తీసుకుని ఉన్న పళంగా సీఎం జగన్ ను కలిశారు.
 
అయితే సీఎం జగన్ నుండి ఉప్పాల కుటుంబానికి స్పష్టమైన హామీ లభించ లేదు. రాంప్రసాద్ సీఎంను కలిసిన సందర్భంలో సీఎం జగన్ తొలిగా జడ్పీ చైర్మన్ పదవి వేరొకరికి ఇస్తానని మాట ఇచ్చానని, ఎమ్మెల్సీ పదవి తీసుకోవాలని కోరినట్టు తెలుస్తోంది. అయితే దీనికి రాంప్రసాద్ ససేమిరా అన్నారు. తమకే జడ్పీ చైర్మన్ పదవే కావాలని సీఎం వద్ద పట్టుబడినట్టు సమాచారం.
 
చివరికి సీఎం జగన్ నుండి ఉప్పాల కుటుంబానికి ఓకే చెప్పారు. ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆశీస్సులతో,  జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానుల‌ ఆశీస్సులతో ఉప్పాల రాంప్రసాద్ కోడలు ఉప్పాల హారిక జెడ్పీ పీఠాన్ని అధిష్ఠిస్తోంద‌ని ఆమె స‌న్నిహితులు తెలిపారు. 
 
కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గా ఆమె ప్రమాణ స్వీకారం శనివారం చేశారు. ఉదయం 10:30 నిమిషాలకు వేమవరం కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో పూజ నిర్వహించి అమ్మ వారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం హారిక మచిలీపట్నం కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయానికి బ‌ల‌య‌లు దేరారు. మ‌ధ్యాహ్నం 1 గంటకు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని జెడ్పీ పీఠం చేజిక్కించుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు