ఆంధ్రాలో ఆడపిల్లల మానంకు రూ.5 లక్షలు : వంగలపూడి అనిత

శుక్రవారం, 21 జనవరి 2022 (17:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఆడపిల్లల మానంకు రూ.5 లక్షలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక రేటును నిర్ణయించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే ఎంత అంటూ మండిపడ్డారు. 
 
పైగా, రాష్ట్రానికి హోం మంత్రిగా సుచరిత ఉన్నారని, ఆమె ఆడపిల్లల అత్యాచారాలపై నోరు మెదపకుండా ఉండటం దురదృష్టకరమని చెప్పారు. ఒకవేళ బయటకు వస్తే ఈ ప్రభుత్వం తరపున ఆడపిల్లల మానంకు రూ.5 లక్షలు, ప్రాణానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమల్లో లేని దిశా చట్టం గురించి ప్రచారం చేసుకోవడం ఒక్క ఏపీ సర్కారుకే చెల్లిందన్నారు. 
 
ఆడపిల్లలకు న్యాయం చేయలేక పోతే హోం మంత్రి సుచరితతో పాటు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు తక్షణం తమతమ పదవులకు రాజీనామా చేయాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు