'ప్రత్యేక హోదా' ఎందుకు అడుగుతున్నారో అర్థం కావట్లే.. అది సర్వరోగ నివారిణి కాదు : వెంకయ్య

ఆదివారం, 7 ఆగస్టు 2016 (14:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు అడుగుతున్నారో అర్థం కావట్లేదనీ అసలు అది సర్వరోగ నివారణి కాదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా హోదాపై సందిగ్ధత ఉందన్నారు. అలాగే ప్రత్యేక హోదా కోసం అనేక రాష్ట్రాలు పోటీపడుతున్నాయని, రాష్ట్ర విభజనప్పుడే ప్రత్యేక హోదాపై చట్టం చేయాల్సి ఉందన్నారు. 
 
అయినప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదాపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా దృష్టిసారించారని ఆయన గుర్తుచేశారు. విభజన చట్టం మేరకు వివిధ పథకాల కింద నిధులను భారీగా కేటాయించినట్టు తెలిపారు. అమృత్‌ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 877 కోట్లు ఇచ్చామని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు.  
 
మరోవైపు.. ఆదివారం విశాఖ రైల్వేస్టేషన్‌లో 6, 7 ఫ్లాట్‌ఫాంలో లిఫ్ట్‌లు, వీఐపీ లాంజ్‌ను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ... శాఖ కేంద్రంగా రైల్వే జోన్ వస్తుందని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఎయిర్‌పోర్టు తరహాలో విశాఖ రైల్వేస్టేషన్‌ను మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే దువ్వాడ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని, భవిష్యత్‌లో మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తామని వారు పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి