తిరుమల, కనకదుర్గమ్మ గుడి త‌లుపులు మూసివేత‌... సూర్యగ్రహణం...

మంగళవారం, 8 మార్చి 2016 (20:51 IST)
సూర్య గ్రహణం సందర్భంగా మంగ‌ళ‌వారం రాత్రి 8.30 ని. నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాలలోని దేవాలయాలు మూసివేశారు. బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యం త‌లుపులు మూసివేశారు. గ్ర‌హ‌ణం వీడిన అనంత‌రం అమ్మ‌వారికి స్న‌ప‌నాభిషేకం చేయించి, ఆల‌యం సంప్రోక్ష‌ణ చేసి తిరిగి భ‌క్తుల‌కు బుధ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. రామతీర్ధాలు, పుణ్యగిరి శివాలయం, తోటపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం, విజయనగరం లోని పైడితల్లి దేవాలయం, తదితర ఆలయాలు మూసివేశారు.
 
మరోవైపు తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి ఆలయాన్ని కూడా గ్రహణం సందర్భంగా మూసివేశారు. మంగళవారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేశారు. తిరిగి బుధవారం ఉదయం 10 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయాల్లో శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తుంటారు. 
 
సూర్యగ్రహణం కావడంతో శ్రీవారి ఆలయంలో సహస్ర కలశాభిషేకాన్ని టిటిడి రద్దు చేసింది. స్వామివారికి సుప్రభాత, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. అలాగే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద సముదాయాన్ని కూడా మూసివేయనున్నట్లు టిటిడి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మీడియాకు తెలిపారు. మరోవైపు గ్రహాలకు అతీతుడైన శ్రీకాళహస్తీశ్వరుని ఆలయాన్ని మాత్రం సూర్యగ్రహణం రోజున తెరిచే ఉంచుతారు.

వెబ్దునియా పై చదవండి