విదేశాల్లో శ్రీవారి నగలను అమ్మేసిన నారా లోకేష్‌.. నిజమా? కాదా?

బుధవారం, 13 జూన్ 2018 (21:01 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారం గత నెల రోజులుగా జాతీయస్థాయిలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. శ్రీవారి ఆభరణాలు కనిపించడం లేదని, కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రం మాయమైపోయిందని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. రమణదీక్షితుల తరువాత వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి.
 
శ్రీవారి ఆలయంలో కనిపించకుండా పోయిన ఆభరణాలు చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్నాయని, కొన్ని నగలను సిఎం కుమారుడు నారా లోకేష్‌ విదేశాల్లో అమ్మి కోట్ల రూపాయలు సంపాదించేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఇది కాస్తా తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి, నారా లోకేష్‌పై తీవ్ర స్థాయిలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేసినా వారిద్దరు పెద్దగా పట్టించుకోలేదు. మిగిలిన క్రిందిస్థాయి నేతలు మాత్రం విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. 
 
కానీ టిటిడిపై వ్యాఖ్యలు చేసిన రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిలకు తితిదే నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకోనున్నా విజయసాయిరెడ్డి మాత్రం మరోసారి తీవ్ర వ్యాఖ్యలే చేశారు. నేను చెప్పినదంతా నిజమేనని, శ్రీవారి ఆభరణాలన్నీ చంద్రబాబునాయుడు ఇంట్లోనే ఉన్నాయని, కొన్ని ఆభరణాలను లోకేష్‌ అమ్మేశారని, సిబిఐ విచారణ జరిగితే ఖచ్చితంగా నిజాలు బయటపడతాయని విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్త భక్తుల్లో అనుమానాలకు తావిస్తోంది. ఈ అనుమానాన్ని నివృత్తి చేయాలంటే ఖచ్చితంగా పూర్తిస్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు హిందూ ధార్మిక సంఘాలు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు