జ‌గ‌న్‌స్వామ్యంలోకి గ్రామ‌స్వ‌రాజ్యం: నారా లోకేష్‌

శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (09:01 IST)
గాంధీజీ క‌ల‌లుగ‌న్న గ్రామ‌స్వ‌రాజ్యం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి నియంత‌స్వామ్యంలో క‌లిసిపోయింద‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆరోపించారు. పంచాయ‌తీ స‌ర్పంచుల హ‌క్కులను హ‌రిస్తూ, అధికారాల‌కు క‌త్తెర వేస్తూ సీఎం జ‌గ‌న్‌రెడ్డి తీసుకొచ్చిన జీవో నెంబ‌ర్ 2పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ నారా లోకేష్  ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

స‌ర్పంచుల హ‌క్కు‌లు కాల‌రాసేందుకే ఈ జీవో తెచ్చార‌న్నారు. స్థానిక సంస్థ‌ల ద్వారా సుప‌రిపాల‌న అందించేందుకు, ప్ర‌జాసంక్షేమం చూసేందుకు, గ్రామాల్లో మౌలిక స‌దుపాయాలు క‌ల్పించేందుకు  రాజ్యాంగంలోని 73వ స‌వ‌ర‌ణ చ‌ట్టం ద్వారా స‌ర్పంచుల‌కు సంక్ర‌మించిన అధికారాలు, హ‌క్కుల‌ను ఒక్క జీవోతో జ‌గ‌న్‌రెడ్డి మింగేశార‌న్నారు.

ఆర్టికల్  243జి ప్రకారం పంచాయతీలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.అందులో భాగంగా గ్రామ సమగ్ర అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల అమలు లాంటి ఎన్నో అధికారాలను,బాధ్యతలను పంచాయతీలకు,సర్పంచులకు కల్పించారు.

కానీ జీవో2 ఆర్టికల్ 243జి స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఉందన్నారు.గ్రామాల అభివృద్ధికి ఎన్నో ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకున్న స‌ర్పంచుల‌ను డ‌మ్మీల‌ను చేసి, త‌మ కార్య‌క‌ర్త‌ల పెత్త‌నంతో పంచాయ‌తీల‌ను న‌డిపేందుకు రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఈ జీవో తెచ్చింద‌ని ఆరోపించారు.

పంచాయ‌తీ యూనిట్‌గా ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసం ఏర్ప‌రిచిన‌ గ్రామ‌స‌చివాల‌యాల ద్వారానే సంక్షేమం, అభివృద్ధి అంతా సాగుతోంద‌ని ప్రక‌టించిన ప్ర‌భుత్వం, ఈ జీవో ద్వారా గ్రామ స‌చివాల‌యాల‌కు స‌ర్పంచులను దూరం చేయ‌డం  చాలా అన్యాయ‌మైన నిర్ణ‌య‌మ‌న్నారు.

జ‌గ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన నుంచీ ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తుల‌పైనా, రాజ్యాంగంపైనా నియంత‌కంటే ఘోరంగా దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. త‌ప్పుడు నిర్ణ‌యాల‌పై వ్య‌తిరేకంగా తీర్పులొచ్చాయ‌ని కోర్టుల‌పైనా, న్యాయ‌మూర్తుల‌పైనా దాడికి దిగిన జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు, రాజ్యాంగ‌బ‌ద్ధ సంస్థ అయిన రాష్ట్ర ఎన్నిక‌ల సంఘంతో యుద్ధం చేసింద‌న్నారు.

ఇప్పుడు పంచాయ‌తీ స‌ర్పంచులను ఉత్స‌వ విగ్ర‌హాలుగా మార్చే జీవో ఇచ్చార‌ని ఆరోపించారు. స‌చివాల‌య వ్య‌వ‌స్థ ప్ర‌వేశ‌పెట్టిన మొద‌ట్లో జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం స‌ర్పంచుల నాయ‌క‌త్వంలోనే ఈ వ్య‌వ‌స్థ‌లు ప‌నిచేస్తాయ‌ని చెప్పి, ఇప్పుడు స‌ర్పంచులకు స‌చివాల‌యాల‌పై ప‌ర్య‌వేక్ష‌ణాధికారాలు ఎందుకు తీసేయాల్సి వ‌చ్చిందో ప్ర‌జ‌ల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని లోకేష్ డిమాండ్ చేశారు.

స్థానిక పాల‌న, గ్రామ‌స్తుల సంక్షేమంతా స‌చివాల‌యాల సిబ్బంది..వాలంటీర్లు చూస్తున్నార‌ని, వీరిపై స‌ర్పంచుల‌కు క‌నీసం ప‌ర్య‌వేక్షణాధికారం కూడా లేకుండా తీసివేసేందుకు తెచ్చిన జీవో నెంబ‌ర్ 2 ముమ్మాటికీ 73వ‌ రాజ్యాంగ‌స‌వ‌ర‌ణ చ‌ట్ట స్పూర్తికి విరుద్ధమ‌న్నారు.

స్థానిక సంస్థ‌ల పాల‌న‌ని స‌ర్పంచుల చేతిలోంచి లాక్కుని ప్రభుత్వం నియమించిన స‌చివాల‌య సిబ్బంది, వైసీపీ కార్య‌క‌ర్త‌లైన‌ వాలంటీర్లకు బ‌ద‌లాయించ‌డం ప్రజాస్వామ్యాన్ని అప‌హాస్యం చేయ‌డ‌మేన‌న్నారు. త‌క్ష‌ణ‌మే జీవో నెంబ‌ర్ 2ని ర‌ద్దుచేసి స‌ర్పంచుల హ‌క్కులు, అధికారాల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు