వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వర్ధన్నపేట పోలీస్ డివిజన్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న దుర్గయ్య యాదవ్ (51) ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో మృతి చెందారు. వారం రోజుల కిందట వర్ధన్నపేట క్వార్టర్స్‌లో ఉన్న సమయంలో తీవ్ర జ్వరం రావడంతో హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి పంపించారు. వైద్యులు స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయని చికిత్స చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. ఈ మృతితో ఈ యేడాది ఇప్పటివరకు స్వైన్ ఫ్లూకు మరణించిన వారి సంఖ్య 17కు చేరింది.
ఈ వైరస్ ఎక్కువగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, మధుమేహులు, గర్భిణులు, ఐదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, సీఓపీడీ, క్యాన్సర్, ఆస్తమా రోగుల్లో, కిడ్నీ, కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నవారు, దీర్ఘకాలంగా స్టెరాయిడ్లు తీసుకుంటున్నవారికి ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది.