ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం నానాటికీ ముదిరిపోతోంది. నిన్నామొన్నటివరకు నీటి వాటాలపై నెలకొన్న వివాదం కాస్తా ఇప్పుడు ఈ జల వివాద పంచాయతీ కాస్త కీలక మలుపు తిరిగింది. అనుమతి లేకుండా జరుగుతోన్న విద్యుత్ ఉత్పత్తిని వెంటనే నిలిపి వేయాలని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు వరుసగా మూడోసారి లేఖ రాసింది.
జూన్ 1 తేదీ నుంచే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం కేటాయింపుతో సంబంధం లేకుండానే నీటిని వినియోగించుకుంటోందని కేఆర్ఎంబీకి ఏపీ సర్కార్ ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు సుమారు 6.9 టీఎంసీల నీటిని ఉపయోగించారని పేర్కొంటూ కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యకార్యదర్శికి ఏపీ ఈఎన్‌సీ నారాయణ రెడ్డి లేఖ రాశారు.
ఇప్పటికే ఈ అంశంపై రెండుసార్లు లేఖ రాసినా.. కేఆర్ఎంబీ పట్టించుకోలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు, ఎగువ నుంచి 17.36 టీఎంసీల మేర నీటి ప్రవాహాలు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తుంటే.. అందులో 40 శాతం నీటిని తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని లేఖలో పేర్కొన్నారు.