ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. ఇందులో ఆయన సెటైర్లు కూడా వేశారు. మా చెల్లి పెళ్ళి... జరగాలి మళ్ళీ మళ్ళీ అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. రాష్ట్రంలో అమృత్ పథకం ద్వారా గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఎందుకు పేదవారికి ఇవ్వడం లేదని తన లేఖలో సీఎం జగన్‌ను సూటిగా ప్రశ్నించారు.
కాగా, సీఎం జగన్‌కు వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో వరుసగా లేఖలు రాస్తున్న విషయం తెల్సిందే. జగన్‌కు నవ కర్తవ్యాలను గుర్తు చేసిన రఘురామ ఇప్పుడు నవ సూచనల పేరుతో కొత్తగా లేఖలు రాయడం మొదలుపెట్టారు.
ముఖ్యంగా, రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాల కోసం 17,000 కాలనీలు నిర్మించాలని ప్రణాళికలు వేశారని అందులో రఘురామ తెలిపారు. ముందుగా రూ.56,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం అనంతరం మాత్రం దాన్ని రూ.70,000 కోట్లకు పెంచిందని చెప్పారు.