ప్యాకేజీ వద్దు.. హోదానే ముద్దు : అసెంబ్లీలో సీఎం జగన్ తీర్మానం

మంగళవారం, 18 జూన్ 2019 (14:43 IST)
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి అత్యధికంగా గ్రాంట్లు వస్తాయని చెప్పారు. 
 
ప్రస్తుతం రూ.3 వేల కోట్ల గ్రాంట్లు మాత్రమే లభిస్తున్నాయని గుర్తుచేసిన సీఎం జగన్.... విభజన సమయంలో పార్లమెంటులో చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. హోదా ఇవ్వకపోవడానికి చాలా సాకులు ఉన్నాయన్నారు. 2014లో హోదాపై కేంద్రం తీర్మానం కూడా చేసిందని గుర్తుచేశారు. 
 
విభజన సమయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ఆదాయాన్ని, ఉద్యోగాలను ఇచ్చే హైదరాబాద్ నగరాన్ని కోల్పోయామని చెప్పిన జగన్... విభజన ఫలితంగా ఉమ్మడి రాష్ట్ర అప్పులను వారసత్వంగా పొందామని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ తమకు అవసరం లేదని... హోదానే కావాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. 
 
అంతేకాకుండా, గత ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.66,300 కోట్ల రెవెన్యూ లోటు ఉందని సభకు తెలిపారు. రాష్ట్రంలో ఉపాధి కల్పన సామర్థ్యం తగ్గిపోయిందని... ఉద్యోగాల కోసం యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారని చెప్పారు. కేవలం ప్రత్యేక హోదా ద్వారానే విభజన నష్టాలను పూడ్చుకోవచ్చని చెప్పారు. పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా ప్రత్యేక హోదానే అవసరమని జగన్ స్పష్టం చేశారు. 14 ఆర్థిక సంఘం సిఫారసు పేరుతో ప్రత్యేక హోదాను ఇవ్వడం లేదని, పైగా, ఆర్థిక సంఘం సభ్యులు ఎక్కడా కూడా ప్రత్యేక హోదాను ఇవ్వొద్దని చెప్పలేదని సీఎం జగన్ గుర్తుచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు