పట్టణ ప్రాంతాల్లో మళ్లీ "అన్న క్యాంటీన్లు" ప్రారంభిస్తాం- అచ్చెన్నాయుడు

బుధవారం, 3 మార్చి 2021 (19:51 IST)
పేదప్రజలు ఆత్మగౌరంతో కడుపునిండా అతితక్కువ ఖర్చుతో ఆహరం తినేలా "అన్న క్యాంటీన్"లను టీడీపీ తిరిగి  ప్రారంభిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. పురపాలక ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ప్రధాన వాగ్ధానం కూడా ఇదే. అన్నార్తుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, రూ. 5కే పేదలకు కడుపునిండా భోజనం పెట్టేందుకు టీడీపీ కట్టుబడి ఉందని బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
 
గత ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రజలకు మూడు పూటలా భోజనం అందించేందుకు అన్న క్యాంటీన్ లు ప్రారంభించారని, రూ. 5లకే భోజనం అందించారని ప్రస్తావించారు. 
టీడీపీ పరిచయం చేసిన అన్న క్యాంటీన్లు ఆంధ్ర ప్రజలకు గొప్ప సేవలందించాయని వివరించారు.
 
పేద ప్రజలకు అందుబాటు ధరలో నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. జూలై 2019 వరకు దాదాపు 6 లక్షల మంది పేద ప్రజలు మూడు పూటలా అన్న క్యాంటీన్ల ద్వారా ఆత్మగౌరవంతో భోజనం పొందారన్నారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి "అన్న క్యాంటీన్"లను మూసివేసి నిరుపేదల నోటికాడ కూడును లాగేసారని దుయ్యబట్టారు.
 
టీడీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ 204 "అన్న క్యాంటీన్"లను మూసివేసిన వైకాపా ప్రభుత్వం ఆ ఆరోపణల్లో ఒక్కటి కూడా నిరూపించలేకపోయిందని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. అన్న క్యాంటీన్లకు కొన్ని మార్పులు చేర్పులు చేసి తిరిగి ప్రారంభిస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం దానిని ఇంతవరకూ అమలులోకి తీసుకురాలేదని, పైగా వాటిని ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్సులుగా చేసి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.
 
అన్న క్యాంటీన్లు మూత పడడం మూలంగా లాక్ డౌన్ సమయంలో లక్షల మంది నిరుపేదలు ఆకలి బాధలతో అలమటించారన్నారు. అన్న క్యాంటీన్లు ఉండి ఉంటే వారికి కనీసం ఆహారభద్రత అయినా చేకూరేదని అభిప్రాయపడ్డారు. మరికొద్ది రోజుల్లో జరగబోయే పురపాలక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తప్పక విజయం సాధిస్తుందని, తమ వాగ్ధానాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని అచ్చెన్నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు