ఏయ్.. విడాకులిస్తావా... లేదా... కాదంటే కులం నుంచి బహిష్కరిస్తాం

శనివారం, 17 సెప్టెంబరు 2016 (12:26 IST)
పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంలో ఓ వివాహిత తీవ్ర మానసిక వేదనకు గురవుతోంది. విడాకులు ఇవ్వకుంటే కులం నుంచి బహిష్కరిస్తామంటూ గ్రామ పంచాయతీ పెద్దలు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆ వివాహిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జిల్లాలోని గోపాలపురానికి చెందిన మడిచర్ల రాజేశ్వరి భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా భర్తకు దూరంగా తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. అయితే, భర్తకు విడాకులు ఇవ్వాలని భర్తతో పాటు గ్రామ పంచాయతీ పెద్దలు ఆమెపై ఒత్తిడి చేయసాగారు. ఈ ఒత్తిడులను తట్టుకోలేని ఆ వివాహిత స్థానిక ఆర్‌ఐ డి.రవి, సీఎస్‌ డీటీ ఆర్‌.గొంతియ్యలకు శుక్రవారం వినతిపత్రం అందజేసింది. 
 
తనను తన సామాజిక వర్గానికి చెందిన పెద్దలు తన భర్తకు విడాకులు ఇవ్వాలంటూ లేని పక్షంలో కుల పరంగా జరిగే శుభకార్యాలకు గానీ ఇతర కార్యక్రమాలకు కానీ పిలవమంటూ బెదిరిస్తున్నారని వినతిపత్రంలో పేర్కొంది. ఒకవేళ ఎవరైనా శుభకార్యాలకు పిలిస్తే పిలిచిన వారికి రూ.500 జరిమానా వేస్తామంటూ ప్రతీ ఇంటికి సమాచారం ఇచ్చి తనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె వినతిపత్రంలో తెలిపింది. 
 
తన వద్ద తలదాచుకునేందుకు వచ్చిన వృద్ధాప్యంలో ఉన్న తన తల్లి బట్టవిల్లి వరలక్ష్మిని, తనను బహిష్కరణ పేరుతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని, అధికారులు పట్టించుకోకపోతే న్యాయ పోరాటానికి దిగుతానని ఆమె వినతిపత్రంలో పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి