అంబులెన్సుల నిర్వహణ విజయసాయిరెడ్డి అల్లుడికి కట్టబెట్టడంలోని ఆంతర్యమేమిటో?: టీడీపీ
బుధవారం, 1 జులై 2020 (12:09 IST)
రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపై స్పందించడంలేదని, పలానా వ్యవహారంలో అవినీతి జరిగిందని, ప్రతిపక్షం మొత్తుకుంటున్నా, ప్రభుత్వం తప్పుదారిలో నడుస్తోందని వేలేత్తి చూపుతున్నా ముఖ్యమంత్రి స్పందించడంలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షం తప్పుడు ఆరోపణలు చేసినట్టయితే, విచారణకు ఆదేశించి వాస్తవాలు ఏమిటో బహిర్గతం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిది కాదా అని రామయ్య ప్రశ్నించారు.
ప్రభుత్వం తప్పులు చేసినప్పుడు హెచ్చరించడానికే ప్రతిపక్షం ఉందని, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే, ప్రభుత్వం అన్యాయం చేస్తోందని చెప్పడానికే ప్రతిపక్షం ఉందన్నారు. ప్రతిపక్షం చెబితే మేం వినం అని ప్రభుత్వం భావించినట్లయితే, చట్టాలు, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలతో పనేముంటుందని, ప్రభుత్వమే నచ్చినట్లుగా చేసుకుంటే సరిపోతుందని రామయ్య ఎద్దేవాచేశారు.
ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 108-104 వాహానాల కొనుగోళ్లు, వాటి నిర్వహణ వ్యవహరంలో రూ.307కోట్ల అవినీతి జరిగినా, ప్రభుత్వంలో చలనం లేదన్నారు.
అంబులెన్సుల నిర్వహణలో ఎంతో అనుభవం, పేరు ప్రఖ్యాతులుండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రశంశలు పొందిన బీ.వీ.జీ సంస్థను కాదని, ఏ2 విజయసాయిరెడ్డి అల్లుడికి చెందిన అరబిందో ఫౌండేషన్ కు కట్టబెట్టడంలోని ఆంతర్యమేమిటో బహిర్గతం చేయాలని రామయ్య డిమాండ్ చేశారు.
108 వాహనాలు చేతులు మారే క్రమంలోనే రూ.307కోట్ల అవినీతి జరిగింధని, ఆధారాలతో సహా బయటపెట్టి, టీడీపీకి చెందిన పట్టాభిరామ్ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకొని నిలదీశాడన్నారు. అరబిందో ఫౌండేషన్ సంస్థ విజయసాయిరెడ్డి అల్లుడిదని, బీవీజీ నుంచి లాక్కొని మరీ ఆ సంస్థకు వాహనాల నిర్వహణను అప్పగించడం ఏమిటని రామయ్య ప్రశ్నించారు.
ఎలాంటి నియమనిబంధనలు పాటించకుండా, దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టుగా 108 వాహనాల కొనుగోళ్లలో రూ.307కోట్లను కాజేశారన్నారు. అరబిందో సంస్థకు ఏవిధమైన అనుభవం లేకపోయినా, టెండర్లు కూడా పిలవకుండా, నిబంధనలకు విరుద్ధంగా వాహానాల నిర్వహణను అప్పగించడం దారుణమన్నారు.
ప్రభుత్వమంటే జగన్ సొంతం కాదని, ఆయనకు చెందిన పబ్లిక్ లిమిటెడ్ కాదని, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన వాహనాల బాధ్యతను దొంగలముఠాకు ఇవ్వడమేంటని రామయ్య మండిపడ్డారు. ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ కమిటీని నియమించి, తప్పుచేసిన వారిని శిక్షించాల్సిన ముఖ్యమంత్రే దొంగచాటుగా, తప్పుడు విధానాలు అవలంభించడం ఏమిటన్నారు.
జెండా ఊపి అంబులెన్సులు ప్రారంభించే నైతిక హక్కు ముఖ్యమంత్రికి లేదని, అవినీతి నీడలా ఆయన్ని వెంటాడుతుంటే ఆయన జెండాలు ఊపి ప్రారంభోత్సవాలు ఎలా చేస్తాడని వర్ల నిలదీశారు. జేండా ఊపి వాహానాలు ప్రారంభించడానికి ముందే, రూ.307కోట్ల అవినీతి జరగలేదని, అరబిందో ఫౌండేషన్ కు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగానే 108 వాహనాల నిర్వహణను అప్పగించామని ముఖ్యమంత్రి స్పష్టంచేయాలన్నారు.
ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని, అలా కాకుండా ఆయన వాహనాలు ప్రారంభిస్తే, రూ.307కోట్ల అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్లేనని భావించాల్సి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రికి నైతిక విలువలు, ధైర్యం ఉంటే, వాహనాలు ప్రారంభానికి ముందే శ్వేతపత్రం విడుదలచేసి, నిజానిజాలు ప్రజలముందే వెల్లడించాలని వర్ల డిమాండ్ చేశారు.
రూ.307కోట్లు కొట్టేశారని చెబుతుంటే, అంబులెన్సులు కుయ్...కుయ్ అంటాయని, బాగా నడుస్తాయని, మంచిరంగులు వేశామని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం కూయ్...కుయ్ అంటుంటే, ప్రజలు రూ.307కోట్లు ఎక్కడా అని నిలదీస్తున్నారని రామయ్య దెప్పి పొడిచారు. ప్రభుత్వం చేసిన అవినీతి గురించి చెప్పకుండా, అంబులెన్స్ సైరన్ గురించి మాట్లాడటమేంటన్నారు.
అంబులెన్సుల నిర్వహణను ఒక చీకటి పనిగా చిత్రీకరిస్తూ, ప్రజలకు వాస్తవాలు వెల్లడించకుండా ప్రభుత్వం ఎందుకు తప్పించుకుంటుందో సమాధానం చెప్పాలన్నారు. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కు డిప్యూటీ సీఈవోగా ఉన్న రాజశేఖర్ రెడ్డికి ఉన్న అనుభవం, గొప్పతనం, విశ్వసనీయత ఏమిటో ప్రభుత్వం చెప్పాలన్నారు. మనవాడైతే చాలు ఏమైనా చేయొచ్చు అన్నట్లుగా ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరించడం సరికాదన్నారు.
చంద్రబాబు హయాంలోనే చంద్రన్న సంచార చికిత్సా కేంద్రాలు, ద్విచక్రవాహన అంబులెన్సులు, ఏ.ఎల్.ఎస్ (అడ్వాన్సడ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్) అంబులెన్సులు, తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్, , మహాప్రస్థానం వాహనాలు నడిచిన విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు.
వాస్తవాలు తెలిసిన అధికారులు కూడా, వైసీపీ ప్రభుత్వమే ఏదో గొప్పగా, కొత్తగా చేస్తున్నట్లు చెప్పడం మంచిపద్ధతి కాదన్నారు. చంద్రన్న సంచార చికిత్సా కేంద్రం పేరుతో నడిచిన వాహనాలకు పేరు మార్చి, గుడ్డిగా ప్రవ్తరించడం అధికారులకు తగదన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం వాహనాలు కొనుగోలు చేయలేదని, అరబిందో ఫౌండేషన్ కు ఆర్థిక పరిపుష్టి కల్పించడానికేనని రామయ్య ఆరోపించారు.
తమ ఆరోపణలు అవాస్తవాలైతే, వాహనాలు ప్రారంభించడానికి ముందే, దానికి సంబంధించిన వ్యవహారంపై వెంటనే శ్వేతపత్రం విడుదలచేయాలన్నారు. ప్రభుత్వం వాయిదాల పద్ధతిలో కాకుండా, ఒకేసారి మొత్తం సొమ్ము చెల్లించి వాహనాలు కొనుగోలు చేయడంలోని ఉద్దేశమేమిటో వెల్లడించాలని రామయ్య డిమాండ్ చేశారు.
ఏ1, ఏ2లకు అధికారమిచ్చింది ... వారు ఆర్థికంగా స్థిరపడటానికి కాదని, ప్రజలకు మేలు చేయడానికనే విషయాన్ని వారు గ్రహించాలన్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చినప్పుడు స్పందించాల్సిన సలహాదారులంతా, ఏ కలుగులో దాక్కున్నారని రామయ్య ఎద్దేవా చేశారు.
రూ.307కోట్ల కుంభకోణం జరిగితే, అజయ్ కల్లం, సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం – అవినీతి కలిసి నడుస్తున్నాయని, అంబులెన్సుల వ్యవహారంపై విచారణకు ఆదేశించకపోవడమే అందుకు నిదర్శనమన్నారు.
ప్రతిపక్షం చేసిన ఆరోపణలపై స్పందించకుండా, జెండా ఊపి ముఖ్యమంత్రి జగన్ అంబులెన్సులు ప్రారంభిస్తే, అవినీతిని ప్రారంభించినట్టేనన్నారు. కంత్రీ, ఓమంత్రి, - మధ్యలో ఓ ఇంతి వ్యవహారంలో ఏం విచారించారని, వారెవరో తేల్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై లేదా అని రామయ్య నిలదీశారు.
దొంగతనం, అవినీతి జరిగితే, దాన్ని బయటపెట్టినవారిని శిక్షిస్తున్నారు గానీ, నిజానిజాలను ప్రభుత్వం నిగ్గుతేల్చడం లేదన్నారు. రూ.307కోట్ల అవినీతి జరిగితే, దానిగురించి వదిలేసి వాహనాలు బాగా నడుస్తాయి.. వాటి రంగు బాగుంది.. కుయ్, కుయ్ మంటాయని చెప్పడం సిగ్గుచేటన్నారు.
ఆ దుర్మార్గుడిపై హత్యాయత్నం, నిర్భయ కేసులు నమోదు చేయాలి :
నెల్లూరుజిల్లాలో పర్యాటక శాఖ విభాగంలో పనిచేసే ఉద్యోగిని, మాస్కు పెట్టుకోమని తోటి ఉద్యోగికి సూచిస్తే, అతను ఇష్టమొచ్చినట్లుగా అంగవికలురాలైన మహిళా ఉద్యోగినిపై దాడిచేయడం దుర్మార్గమని రామయ్య మండిపడ్డారు.
మహిళ, అంగవికలురాలు అనికూడా చూడకుండా, మానవత్వం మరిచి దాడికి పాల్పడిన వ్యక్తిపై హత్యాయత్నం, నిర్భయ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని, అతన్ని వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని రామయ్య డిమాండ్ చేశారు.
పట్టపగలే, అత్యంత పాశవికంగా మహిళపై దాడికి పాల్పడిన వ్యక్తిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలన్నారు. తోటి ఉద్యోగులు అడ్డుపడకపోయి ఉంటే, సదరు దుర్మార్గుడు మహిళా ఉద్యోగిని అత్యంత కిరాతకంగా చంపేసి ఉండేవాడన్నారు. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకోవాలన్నారు.