వివాహితతో వాట్సాప్ చాటింగ్, ఓ పూజారి ప్రాణం తీసింది...

మంగళవారం, 21 ఆగస్టు 2018 (22:35 IST)
విజయవాడ కృష్ణలంకకు చెందిన సీతారామాజంనేయశర్మ బాలాజీనగర్‌లో ఆంజనేయస్వామి ఆలయం వద్ద పురోహితుడుగా చేసేవాడు. అదే ఆలయానికి వెళ్తున్న మౌనిక అనే వివాహితకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్ పంపితే ఆమె ఓకే చేసింది. దీంతో ఇద్దరూ ఫోన్ నెంబర్లు షేర్ చేసుకుని వాట్సాప్‌లో చాటింగ్ చేసుకోవడం ఫోటోలను పంపించుకోవడం మొదలుపెట్టారు. మౌనిక నాలుగేళ్ల క్రితం సాయిశ్రీనివాస్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
భార్య మౌనిక సెల్‌ఫోన్‌ చూసిన శ్రీనివాస్‌కు సీతారామాంజనేయ శర్మతో చేసిన చాటింగ్‌ల బాగోతం బయటపడింది. దీంతో సీతారామాంజేయశర్మకు ఫోన్‌ చేసిన సాయిశ్రీనివాస్‌, అతని స్నేహితులు భవనంపైకి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. శర్మ జేబులో ఉన్న సెల్‌ఫోన్‌‌ను పరిశీలించగా మౌనికతో తీయించుకున్న ఫొటోలు కనిపించాయి. దీంతో మరింత ఆగ్రహానికి గురైన శ్రీనివాస్, తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు శర్మ. దీంతో అతడిని తీసుకొచ్చి జాతీయ రహదారికి పక్కన పడేశారు. 
 
భర్త ఇంటికి తిరిగి రాకపోవడంతో శర్మ భార్య స్వరూప కృష్ణలంక పోలీసులను ఆశ్రయించింది. ఎవరో అమ్మాయితో చాటింగ్‌ చేస్తున్నాడని, ఆమె భర్తే ఏదో ఒకటి చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది.. దీంతో కృష్ణలంక పోలీసులు శర్మ కాల్‌డేటాను విశ్లేషించి, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మౌనిక భర్త సాయిశ్రీనివాస్‌తోపాటు అతని స్నేహితులను అరెస్టు చేశారు పోలీసులు. అయితే మౌనిక, సీతారామాజంనేయ శర్మల మధ్య కేవలం చాటింగ్ మాత్రమే నడిచిందని వీరి మధ్య ఎటువంటి వివాహేతర సంబంధం లేదని పోలీసులు నిర్ధారించినట్టు సమాచారం. ఏది ఏమైనా చాటింగ్ ఓ పూజారి ప్రాణం తీసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు