ముఖ్యమంత్రి కమ్మకులాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారు?

గురువారం, 20 ఆగస్టు 2020 (19:03 IST)
స్వర్ణప్యాలెస్ ఘటనచాలా దురదృష్టకరమైనదని, దానిపై పూర్థిస్థాయిలో విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని టీడీపీ గతంలోనే కోరిందని, కానీ వాస్తవంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జగన్ ప్రభుత్వం రెచ్చగొట్టేధోరణితో వ్యవహరిస్తోందని టీడీపీనేత, ఆపార్టీ ఎమ్మెల్సీ వై.వీ.బీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.

ప్రభుత్వం, ఒకవర్గంమీడియా కావాలనే ఒకవర్గంపై దుష్ర్పచారంచేస్తోందని ఆయన ఆరోపించారు. వైద్యవ్యవస్థను దెబ్బతీసే భారీ కుట్రఏదో ప్రభుత్వం చేస్తున్నట్లుగా తమకు అనిపిస్తోందన్నారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..ప్రభుత్వం, ఒక వర్గం మీడియా స్వర్ణప్యాలెస్ ఘటనను ఆధారంగా చేసుకొని ఒకసామాజికవర్గాన్ని రాచిరంపాన పెట్టి, వేధింపులకు  గురిచేయాలని చూస్తోంది. 

స్వర్ణప్యాలెస్ ను ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రంగా వినియోగించినప్పుడు దానిలో అన్ని సౌకర్యాలు, వసతులున్నాయా లేదా అని అధికారులు పరిశీలించారా? హోటల్ ను క్వారంటైన్ కేంద్రంగా వినియోగించి, తిరిగి దాన్ని కోవిడ్ కేంద్రంగా వాడుకోమంటూ రమేశ్ ఆసుపత్రికి అనుమతులిచ్చింది ప్రభుత్వమే అయినప్పుడు, అక్కడ జరిగిన దుర్ఘటనలో రమేశ్ ఆసుపత్రికి ఎంతబాధ్యత ఉంటుందో, ప్రభుత్వానికి, అధికారులకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. 

ఇక రమేశ్ ఆసుపత్రి వారు ఎక్కవ ఫీజులు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యులు, నర్సులు, ఇతరేతర సిబ్బంది కరోనా రోగులకు సేవలు చేయడానికి ప్రాణభయంతో ముందుకు రావడం లేదు. తమను నమ్మి, తమవద్దకు వచ్చిన రోగులను బతికించాల్సిన బాధ్యత రమేశ్ ఆసుపత్రిపై ఉన్న నేపథ్యంలో వారికి ఉత్తమమైన వైద్యసేవలు అందించడం కోసం, ఎక్కువ జీతాలిచ్చి మరీ సిబ్బందిని నియమించుకోవడం జరిగింది.

కోవిడ్ రోగులు ఇచ్చే సొమ్ముని, వారికి సాయమందించే సిబ్బందికే రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం అందచేసింది. దీనిలో వ్యాపారకోణం ఎక్కడుందో ప్రభుత్వమే తేల్చాలి.  ఉయ్యూరులో నూకలవెంకటేశ్వరరావు అనే పాఠశాలయజమానికి కరోనా వస్తే, ఆయన్ని తమ ఆసుపత్రిలో చేర్చుకోవడానికి రమేశ్ బాబు నిరాకరించారు.

రమేశ్ ఆసుపత్రి కరోనా రోగుల నుంచి విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తే, ప్రాణభయంతో వచ్చేవారిని ఇష్టానుసారం ఆసుపత్రిలో  ఎందుకు చేర్చుకోలేదు? కరోనాను బూచిగా చూపి, రోగులను మరింత భయభ్రాంతులకు గురిచేసి  వారిని దోపిడీ చేయాలన్న దురుద్దేశంతో రమేశ్ బాబు ప్రవర్తించాడా? రమేశ్ బాబుకి అలాంటి ఉద్దేశమే ఉంటే, ఎంతఫీజైనా భరిస్తాము.

తమకు వైద్యం చేయండని బతిమాలిన వెంకటేశ్వరరావుకి ఇంటివద్దే చికిత్స పొందాలని చెప్పాల్సిన అవసరం ఏమిటి? మూడుదశాబ్డాలకు పైగా వైద్యరంగంలో సేవలందిస్తూ, పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తిపై నీచాతినీచంగా దుష్ప్రచారం చేయడం, ఆయనగురంచి, ఆయన కుటుంబం గురించి కొందరు అధికారులు, పోలీసులు ఇష్టారాజ్యంగా మాట్లాడటం చూస్తున్నాము. అలాంటివారంతా ప్రభుత్వాలు శాశ్వతం కాదనే విషయం తెలుసుకుంటే మంచిది. 

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అటువంటి వారికి ఇంతకు ఇంత రుచిచూపిస్తాం.  డాక్టర్ రమేశ్ బాబు నిజంగా తప్పు చేసుంటే, ఆయన భారీగా ఫీజులు వసూలు చేసే వాడే అయితే, ఆయన ధనదాహానికి బలైన బాధితులు ఇంతవరకు ప్రభుత్వానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదు. తానేమీ కమ్మవాడిగా డాక్టర్  రమేశ్ బాబుని సమర్థించడం లేదు. ఈ ప్రభుత్వ విధానాలను, వ్యవహరించేతీరుని తప్పు పడుతున్నాను.

రమేశ్ బాబు అంశంలో ప్రభుత్వ తీరు చూశాక, ఏ వైద్యుడైనా, ప్రజలకు సేవచేయడానికి ముందుకొస్తాడా?  ప్రభుత్వం, కావాలనే మంచి సంస్థలపై, పేరున్న పరిశ్రమలపై, వివిధరంగాల్లోని ప్రముఖులపై కులముద్ర వేసి, వేధింపులకు గురిచేస్తూ కక్షసాధిస్తోంది. కమ్మవారేమీ దోపిడీదారులు కారు,  అవినీతికి పాల్పడి జైళ్లకు వెళ్లలేదు.

తరతరాలనుంచి వ్యవసాయంపై, వ్యాపారంపై శ్రద్ధచూపి, పైకొచ్చారు తప్ప, ఆవర్గం వారు ఎదుటివారిని దోపిడీచేసి, హత్యలు చేసి ఎదగలేదు. కమ్మవారు పరిశ్రమల్లో, కంపెనీల్లో తమకుటుంబసభ్యులను షేర్ హోల్డర్లుగా, భాగస్వాములుగా పెట్టుకోకూడదా? విచారణపేరుతో ఆ వర్గానికి చెందిన ఆడవారిని పిలిపించి, వేధింపులకు గురిచేసి పైశాచికానందం పొందడం ఈ రాష్ట్రంలోనే చూస్తున్నాం.

నేను కమ్మవారందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. తప్పుచేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని తెలుసుకోండి. లక్షకోట్ల అవినీతికి పాల్పడి, సీబీఐ, ఈడీలకేసులుండి, 18నెలలు జైల్లో ఉండివచ్చిన వ్యక్తే దర్జాగా బయట తిరుగుతుంటే, తప్పుచేయని రమేశ్ బాబు ఎందుకు దాక్కుంటున్నారు? దయచేసి రమేశ్ బాబు బయటకు రావాలని కోరుతున్నా.

బయటకొస్తే ఏమవుతుంది.. మహా అయితే జైల్లో పెడతారు. భయపడకుండా రమేశ్ బాబు ప్రజల ముందుకు రావాలి.  నటుడు రామ్ ఏదో ట్వీట్ పెడితే, ఓవర్ గా రియాక్ట్ అయిన పోలీస్ అధికారికి విజయసాయిరెడ్డి పెట్టే ట్వీట్లు కనిపించడం లేదా? రామ్ కు భావవ్యక్తీకరణ స్వేఛ్ఛ లేదా? రామ్ కూడా భయపడకుండా తన వాదనను, అభిప్రాయాలను ట్వీట్లరూపంలో ప్రజలకు తెలియచేయాలి.

ఆయన సినిమాల్లోనే కాదు, బయటకూడా హీరోలానే ఉండాలని కోరుతున్నా. విజయవాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, తానేం చెప్పాలనుకుంటున్నాడో చెప్పాలని రామ్ ను కోరుతున్నాను. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంటే కమ్మవారు ఏమీ చేయకూడదా? ప్రభుత్వానికి, జగన్ కు బానిసల్లా బతకుతూ, వారు చేస్తున్న తప్పులను చూస్తూ ఊరుకోవాలా? 

తమవ్యాపారాలు, పరిశ్రమలు, ఉద్యోగాలు ఆపేసి పొరుగు రాష్ట్రాలకు పారిపోవాలా?  ఏ తప్ప చేయనప్పుడు కమ్మ వారు తప్పుడు మనిషిని చూసి ఎందుకు భయపడాలి. ముఖ్యమంత్రి ఎందుకంతలా కమ్మకులాన్ని చూసి భయపడుతున్నారు. కమ్మవాళ్లంతా ఆయనకు బానిసల్లా ఉండి, ఆయన చేసే కుట్రలు, కుతంత్రాలు, దోపిడీలకు జైకొట్టాలా?  151 సీట్లతో గెలిచాను.. చారిత్రక విజయం సాధించానని చెప్పుకునే జగన్, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో పెట్టుకున్నప్పుడే తన చారిత్రక విజయాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాడు.

రమేశ్ ఆసుపత్రి ఎండీని వేటాడుతున్న జగన్, ఎల్జీ పాలిమర్స్ ఎండీ, ఛైర్మన్, డైరెక్టర్లను, వారి బంధువులను, ఎందుకు పిలిపించి విచారించడం లేదు? ఎల్జీ పాలిమర్స్ వారు భారతి సిమెంట్స్ కు సంచులు తయారు చేస్తున్నారని వారిని వదిలిపెట్టారా? లేక వారితో జగన్ ఏమైనా చీకటి ఒప్పందం చేసుకున్నాడా? తన బాబాయి వివేకానందరెడ్డి హత్య జరిగి, ఎన్నాళ్లైంది?  ఆకేసు విచారణకు జగన్ ప్రభుత్వం ఏం చేసింది?

రమేశ్ బాబు కోసం పది బృందాలను నియమించిన జగన్, వివేకా కేసువిచారణ కోసం ఎంతమంది అధికారులను నియమించి, ఏం పురోగతిసాధించి, ఎంతమందిని అరెస్ట్ చేయించాడు? ఎవరు, ఏకులంలో పుట్టాలనేది దేవుడు నిర్ణయిస్తాడు కానీ, జగన్ కాదు. జగన్ చూడాల్సింది కులాన్ని కాదు, వ్యక్తుల గుణాలను, వారి ప్రతిభా పాఠవాలను, శక్తిసామర్థ్యాలను. ప్రజలను కులం, మతం పేరుతో ఎల్లకాలం మోసగించలేమనే నిజాన్ని జగన్ తెలుసుకుంటే మంచిది.

గతంలో కేసీఆర్ కూడా కమ్మకులంపై అకారణంగా దాడిచేశారు. ఇప్పుడు తమ రాష్ట్రంకోసం, అభివృద్ధికోసం  ఆయన, కేటీఆర్ మనసు మార్చుకున్నారు.  కులరాజకీయాలు నడపబట్టే, రాష్ట్రంలో ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి రావడం లేదు. జగన్ చూడాల్సింది కులాలు కాదు, వ్యక్తుల గుణాలు, వారి ప్రతిభాపాటవాలు, శక్తిసామర్థ్యాలు.  అతి సర్వత్రా వర్జయేత్ అనే నానుడిని ముఖ్యమంత్రి తెలుసుకుంటే మంచిది. 

వైద్యులను, నర్సులను కులమతాలపేరుతో,  వేధించి ఇబ్బందులకు గురిచేస్తే, ప్రజలకు జగన్ వైద్యం చేస్తాడా? సామాన్య ప్రజలకు సకల వసతులు, సౌకర్యాలు ఉండవు. వారేమీ జగన్ లా రాజప్రాసాదాల్లో , మందీ మార్బలంతో నివసించడం లేదు. ఒకే గదిలో నలుగురైదుగురు నివసిస్తుంటారు.

ఢిల్లీ ముఖ్యమంత్రిలా యుద్ధ ప్రాతిపదికన పడకలు ఏర్పాటుచేయడం, వైద్యసేవలందించడం చేయకుండా కులరాజకీయాలతో వేధింపులు చేయడం ద్వారా జగన్ ఇప్పటికీ కులంపైనే పోరాడుతున్నాడని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా జగన్ లా నిస్సిగ్గుగా, ఒక కులంపై పడి ఏడవలేదు. ఆయనపై పడిన కులముద్ర మచ్చ ఎప్పటికీ అలానే ఉంటుందనడంలో  ఎటువంటి సందేహం లేదు. 

కమ్మకులంపై జరుగుతున్న దాడిని అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన సమయం వచ్చింది. ఈరోజు రమేశ్ బాబు ఒక్కడేలే... మనకెందుకులే అని చూస్తూ ఊరుకుంటే,  ఈప్రభుత్వం రేపు అందరిపై పడి, వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది.  స్వర్ణప్యాలెస్ దుర్ఘటనలో రమేశ్ బాబు పాత్ర ఎంతుందో, ముఖ్యమంత్రికి, ఇతర అధికారులకుకూడా అంతే పాత్ర ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు