డీజె అనే కమర్షియల్ సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఓ పాటలో తాము శివుని పూజలో ఉపయోగించే పవిత్రమైన పదాలను ఉపయోగించడాన్ని సహించబోమని వివాదానికి తెరతీసాయి కొన్ని కులసంఘాలు. ఆ పదాలు తొలగించనిదే సినిమాను విడుదల కానివ్వమని ఘాటైన హెచ్చరికలు చేయడంతోపాటు కొందరు ప్రభుత్వ పెద్దలను సైతం కలిసి సహాయం కోరారు. ప్రజల మనోభావాలను గౌరవించే క్రమంలో భాగంగా ఆ సినిమా నిర్మాత, దర్శకుడు అందరూ దిగివచ్చి వాటిని మార్చి సినిమా విడుదలకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇది నాణేనికి ఓవైపు.
మరోవైపు -
ఆయనో మాజీ ఐఎఎస్ అధికారి. పేరు ఐవైఆర్ కృష్ణారావు. మాజీ సిఎస్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఫేస్‌బుక్‌లో కొన్ని ప్రభుత్వ వ్యతిరేక కామెంట్లు, పోస్ట్‌లు చేసారని, ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కలుసుకున్నాడనే నెపంతో మర్యాదపూర్వకంగా సమాచారం అందించకుండా, వివరణనైనా కోరకుండా, ఉన్న గౌరవాధ్యక్షుడి పోస్టులో నుండి తీసిపారేసారు.
మరి ఇలాంటి విషయంలో ఆ సంఘాలు పెద్దగా జోక్యం చేసుకున్నట్లు కనబడటం లేదు. నేడు అధికారంలో ఉన్నవారితో గిల్లికజ్జాలు పెట్టుకుంటే భవిష్యత్తులో తమకు ఎలాంటి ప్రయోజనాలూ అందవనే భయమో.. సినిమాలపై నోరు చేసుకుంటే వచ్చేంత పబ్లిసిటీ, మైలేజీ రాదనే చిన్నచూపో కానీ.. ఇప్పటికైతే కృష్ణారావుగారు ఒంటరిగానే ఉన్నారు. కానీ ఈ తరహా రాజకీయాలు చేసుకుంటూ పోతే, ఎంతమంది బావాబామ్మర్దులు కలిసినా, నటసింహాలు, జూనియర్లు ప్రచారం చేసినా, రానున్న ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కాకతప్పవని ప్రచారం జరుగుతోంది.